కోల్ ఇండియా vs కేంద్ర ప్రభుత్వం: రూ. 37,500 కోట్ల బొగ్గు గ్యాసిఫికేషన్ పథకంపై అభ్యంతరాలు..

కోల్ ఇండియా vs కేంద్ర ప్రభుత్వం: రూ. 37,500 కోట్ల బొగ్గు గ్యాసిఫికేషన్ పథకంపై అభ్యంతరాలు..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన రూ. 37,500 కోట్ల బొగ్గు-గ్యాసిఫికేషన్ (Coal Gasification) ప్రోత్సాహక పథకంలోని నిబంధనలపై ప్రభుత్వ రంగ సంస్థ 'కోల్ ఇండియా' (CIL) కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే ఈ నిబంధనలు మాకు నష్టం కలిగించేలా ఉన్నాయని ప్రభుత్వానికి తెలిపింది.

కోల్ ఇండియా  కీలక ఆందోళనలు ఏంటంటే... దరఖాస్తు చేసుకోవడానికి కేవలం 60 రోజులు (రెండు నెలలు) మాత్రమే గడువు ఇవ్వడంపై కోల్ ఇండియా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తక్కువ సమయం వల్ల ముందే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీ చేసుకున్న ప్రైవేట్ కంపెనీలకే ఎక్కువ లబ్ది చేకూరుతుందని, తమకు కనీసం ఆరు నెలల సమయం కావాలని కోరింది.

 కోల్ ఇండియా విజ్ఞప్తిని బొగ్గు మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఒక రౌండ్ ముగిసిన వెంటనే నెక్స్ట్  రౌండ్ బిడ్డింగ్ ప్రారంభమవుతుందని, ప్రతి రౌండ్‌కు రెండు నెలల గడువు ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రోత్సాహకాలను లెక్కించే ఖర్చుల నుంచి క్యాప్టివ్ పవర్ ప్లాంట్లను మినహాయించడం పట్ల కూడా ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కోల్ ఇండియా ఈ పథకంలో బిడ్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తూనే, ఈ నిబంధనల వల్ల జరిగే ప్రభావాలను అసెస్మెంట్ వేసుకుంటోంది.

బొగ్గు-గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక పథకం వివరాలు:

బొగ్గును గ్యాస్‌గా మార్చే (గ్యాసిఫికేషన్) ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది జూన్‌లో కేంద్రం రూ. 37,500 కోట్లతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పోటీ బిడ్డింగ్ ద్వారా అర్హులైన కంపెనీలను ఎంపిక చేస్తారు. తక్కువ ఆర్థిక సబ్సిడీ కోరే సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అర్హత ఉన్న ప్లాంట్ & మెషినరీ ఖర్చులో ప్రభుత్వం 20 శాతం వరకు ఆర్థిక సహాయం (సబ్సిడీ) అందిస్తుంది.

సబ్సిడీ పరిమితులు (Caps): ఒకే ప్రాజెక్టుకు గరిష్టంగా రూ. 5,000 కోట్లు. ఒకే కార్పొరేట్ గ్రూప్‌నకు (దాని అనుబంధ సంస్థలతో కలిపి) గరిష్టంగా రూ. 12,000 కోట్లు.

యూరియా, సింథటిక్ సహజ వాయువు ప్రాజెక్టులు మినహా, ఇతర డౌన్‌స్ట్రీమ్ ఉత్పత్తులకు గరిష్టంగా రూ. 9,000 కోట్ల పరిమితి విధించారు.

లక్ష్యం ఇంకా  పర్యవేక్షణ:
దేశంలో 2030 నాటికి 100 మిలియన్ టన్నుల (MT) బొగ్గు గ్యాసిఫికేషన్‌ సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా సుమారు 75 మిలియన్ టన్నుల బొగ్గు, లిగ్నైట్‌ను గ్యాసిఫై చేయగల ప్రాజెక్టులకు ఈ పథకం ద్వారా మద్దతు ఇస్తారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు వ్యయ కార్యదర్శి అధ్యక్షతన ఒక సాధికార బృందాన్ని, అలాగే ప్రత్యేక టాస్క్ ఫోర్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలను కేంద్రం ఏర్పాటు చేసింది.