రాకెట్ తో 87వేల లీటర్ల నీళ్లు అంతరీక్షంలో విడిచిన నాసా.. ఆ తర్వాత ఏమైందంటే?

రాకెట్ తో 87వేల లీటర్ల నీళ్లు అంతరీక్షంలో విడిచిన నాసా.. ఆ తర్వాత ఏమైందంటే?

అంతరిక్షంలో మానవుడు దీర్ఘకాలిక ప్రయాణాలు చేయాలన్నా.. చంద్రుడు, అంగారక గ్రహంపై నెలల తరబడి జీవించాలన్నా కేవలం శక్తివంతమైన రాకెట్లు ఉంటే సరిపోదు. వ్యోమగాతులకు నిరంతరం ఆక్సిజన్, తాగునీరు, ఆహారం అవసరం. అలాగే వ్యర్థాలు, కార్బన్ డై ఆక్సైడ్‌ను ఎప్పటికప్పుడు సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. స్వల్పకాలిక మిషన్లయితే భూమి నుంచి సరుకులు తీసుకెళ్లవచ్చు కానీ.. సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు నిరంతరం సరఫరా చేయడం అసాధ్యం. ఈ సమస్యకు పరిష్కారంగా నాసా శాస్త్రవేత్తలు దశాబ్దాల క్రితమే పరిశోధనలు ప్రారంభించారు.

భూమిపై మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను ఇస్తాయి. నీరు నిరంతరం రీసైకిల్ అవుతుంది. కానీ అంతరిక్ష నౌక, ఆవాసాలలో ప్రతి వనరును చాలా జాగ్రత్తగా నియంత్రించాలి. ప్రయాణం ఎంత దూరంగా ఉంటే.. భూమిపై నుంచి కొత్త సరుకులపై ఆధారపడటం అంత కష్టమవుతుంది. అందుకే వ్యర్థాలను పారవేయకుండా.. వాటిని తిరిగి ఉపయోగించుకునే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ గురించి నాసా పరిశోధకులు అప్పట్లోనే అధ్యయనం చేశారు.

ఈ ప్రయోగాల్లో జీవుల పాత్ర ఎంతో కీలకమని గుర్తించారు. ముఖ్యంగా మొక్కలు కాంతి, నీటి సాయంతో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా ఆహారాన్ని కూడా అందిస్తాయి. మానవులు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్, వ్యర్థాలను మొక్కలు, సూక్ష్మజీవుల సాయంతో ప్రాసెస్ చేసి నీరు, పోషకాలను తిరిగి పొందవచ్చు. కేవలం భూమి మీద ఉన్న పర్యావరణాన్ని అంతరిక్షంలోకి మార్చడం కాకుండా, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఈ జీవ ప్రక్రియలను సమన్వయం చేయడంపై దృష్టి పెట్టారు.

అయితే అంతరిక్షంలో ఇలాంటి వ్యవస్థలను సృష్టించడం అంత తేలికైన విషయం కాదు. మొక్కల ఎదుగుదలకు కాంతి, ఉష్ణోగ్రత, నీరు కచ్చితమైన మోతాదులో ఉండాలి. ఒకవేళ సిస్టమ్‌లో ఏదైనా చిన్న లోపం తలెత్తితే మొత్తం జీవన వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది. వ్యోమగాతులకు వెంటనే అత్యవసర సరుకులు అందే అవకాశం ఉండదు కాబట్టి, ఈ బయోలాజికల్ సిస్టమ్స్ పూర్తిగా నమ్మదగినవిగా ఉండాలని శాస్త్రవేత్తలు భావించారు. మెకానికల్ టెక్నాలజీతో పాటు ఈ సహజ పద్ధతులను జోడించి ఒక బలమైన నెట్‌వర్క్‌ను రూపొందించాలని ప్రయత్నించారు.

భూమి నుండి భారీ మొత్తంలో ఆహారం, నీరు మోసుకెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. వనరులను రీసైకిల్ చేయడం ద్వారా వ్యోమగాతులపై భారాన్ని తగ్గించవచ్చు. అంగారక గ్రహంపై భవిష్యత్తులో ఏర్పడే స్థావరాలకు ఈ పరిశోధనలే పునాది కానున్నాయి. కాలం మారినా, అంతరిక్షంలో మానవుని మనుగడకు కావలసిన వనరుల నిర్వహణ సమస్య అలాగే ఉంది. ఈ క్రమంలోనే 1962లో భూమికి 167 కిమీ ఎత్తున 87వేల లీటర్ల నీళ్లను రిలీజ్ చేసి ఏం జరుగుతుంది, వాటర్ ఎలా రియాక్ట్ అవుతుందో నాసా పరిశోధనలు చేసింది. ఆ నీరు ఒక్కసారిగా పెద్ద నీటి మేఘంలా భూమిపైన వాతావరణంలో ఏర్పడింది.