హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పలు పరీక్షలు నిర్వహించగా గుండెకు సంబంధించిన సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైద్యులు రెండు స్టెంట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఆరోగ్యం నిలకడగా ఉందని, అబ్జర్వేషన్ అనంతరం సాధారణ గదికి తరలిస్తామని వైద్యులు తెలిపారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంబటి అనారోగ్యానికి గురయ్యాడని తెలియడంతో వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. పలువురు నేతలు ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు.
