300 కిలోల కల్తీ పన్నీర్ సీజ్: ఫుడ్ సేఫ్టీ అధికారుల షాకింగ్ రైడ్స్ ! కొనేముందు అలర్ట్..

300 కిలోల కల్తీ పన్నీర్ సీజ్: ఫుడ్ సేఫ్టీ అధికారుల షాకింగ్ రైడ్స్ !  కొనేముందు అలర్ట్..

రాబోయే రాఖి పండుగ పురస్కరించుకుని నోయిడాలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తినేందుకు ఏమాత్రం పనికిరాని 300 కిలోల కల్తీ పన్నిర్‌ను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

ఉత్తర ప్రదేశ్ ఆహార భద్రతా విభాగం, జిల్లా యంత్రాంగం ఆదేశాలతో అధికారులు ఈ మెరుపు దాడులు చేపట్టారు. నోయిడాలోని గర్హి చౌఖండి ప్రాంతంలో ఉన్న ఒక డెయిరీపై దాడి చేసి, హర్యానాలోని మేవాత్ నుంచి సప్లయ్  అయిన 300 కిలోల పన్నిర్‌ను పట్టుకున్నారు. ఆహార భద్రతా అధికారులు విశాల్ గుప్తా, రితు సక్సేనా ఆ పన్నిర్ శాంపిళ్లను పరీక్షల కోసం సేకరించి, మిగిలిన నిల్వను వెంటనే పారేశారు.

నోయిడా వ్యాప్తంగా కొనసాగుతున్న సోదాలు:
రవాణా వాహనాలపై నిఘా పెడుతూ బులంద్‌షహర్ నుంచి ఢిల్లీకి పనీర్ తీసుకువెళ్తున్న ఒక వాహనాన్ని డీఎన్‌డీ ఫ్లైఓవర్ వద్ద అడ్డుకుని శాంపిళ్లు సేకరించారు. నోయిడా సెక్టార్ 88 మండి, గ్రేటర్ నోయిడాలోని తుగల్‌పూర్, నాలెడ్జ్ పార్క్-2 డెయిరీల నుంచి పన్నిర్, పెరుగు శాంపిళ్లను సేకరించారు. స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తూ..  గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రి వద్ద ఉన్న ఒక స్వీట్ షాప్ నుంచి ఖోయా, బూందీ లడ్డూ శాంపిళ్లను సేకరించారు.

మొత్తం 8 శాంపిళ్లు ల్యాబ్‌కు:
ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 రకాల పాలు, స్వీట్ల శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు అసిస్టెంట్ కమిషనర్ సర్వేశ్ మిశ్రా తెలిపారు. పండగ పూర్తయ్యే వరకు నోయిడా, గ్రేటర్ నోయిడా అంతటా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. పండుగ సమయంలో పనీర్, ఖోయా, మిఠాయిలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. కాబట్టి స్వీట్లు, పాల ఉత్పత్తులు కస్టమర్లు  కొనేటప్పుడు నాణ్యమైన, నమ్మకమైన షాపుల్లోనే తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.