ఏపీ రాష్ట్రం ఉత్తరాంధ్రలోని వెనకబడిన ప్రాంతంలో పుట్టి.. బాగా చదువుకుని.. ఆ తర్వాత లండన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 20 ఏళ్లుగా లండన్ లో ఉంటున్న ఈ ఫ్యామిలీ.. కైలాస్ యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుని.. లండన్ నుంచి నేరుగా నేపాల్ వచ్చారు. భర్త, భార్య, కుమారుడు, కుమార్తె.. కుమారుడి వయస్సు 18 ఏళ్లు.. కుమార్తె వయస్సు 13 ఏళ్లుకాగా.. లండన్ నుంచి ప్రయాణం అంతా సాఫీగానే సాగింది.. మానస సరోవం వెళ్లే దారిలో.. వీళ్లు ప్రత్యేకంగా బుక్ చేసుకున్న కారులో వెళుతుండగా.. భారీ వరదలతో కారు కొట్టుకుపోయింది.. ఇప్పటి వరకు ఆచూకీ లేదు.. ఈ ఘటనతో శ్రీకాకుళం జిల్లా పార్వతీపురంలో అందర్నీ కలిచి వేసింది.
పార్వతీపురం పట్టణంలోని పండా వీధికి చెందిన సుభాష్ చంద్ర సాహూకు ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు సంతోష్ కుమార్ సాహూ, తన భార్య సురభి, కుమారుడు స్పందన్, కుమార్తె సైనా సాహుతో కలిసి 20 ఏళ్లుగా లండన్‌లో స్థిరపడ్డారు. ఇటీవల వారు అక్కడి నుంచి నేపాల్ మీదుగా మానస సరోవర యాత్రకు వెళ్లారు. మార్గమధ్యలో ఓ వంతెనపై వీరు ప్రయాణిస్తున్న వాహనం వెళ్తుండగా.. ఒక్కసారిగా విరుచుకుపడిన వరద ప్రవాహం వారిని ముంచెత్తింది. వారు ప్రయాణిస్తున్న వాహనం వరదల్లో చిక్కుకుని కుటుంబం మొత్తం గల్లంతైనట్లు నేపాల్ గైడ్ ద్వారా బంధువులకు సమాచారం అందింది.
సంతోష్ తల్లిదండ్రులు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉన్న రెండో కుమారుడు మురళీ సాహూ దగ్గర ఉంటున్నారు. ఎన్నో ఏళ్లుగా విదేశాల్లో ఉన్నా దైవచింతనతో యాత్రకు వెళ్లిన తమ బిడ్డలు ఇలా ప్రకృతి విపత్తులో చిక్కుకోవడంతో తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల శోకం మిన్నంటింది. ఈ వార్తతో బంధుమిత్రుల్లో తీవ్ర ఆందోళన అలముకుంది. మారుమూల గ్రామం నుంచి విదేశాలకు వెళ్లి ఉన్నతంగా స్థిరపడ్డ కుటుంబాన్ని ప్రకృతి కబళించడంతో పార్వతీపురంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
