‘రాఖీ కట్టడానికి వస్తున్నా.. రెడీగా ఉండు’ అని చెప్పిన చెల్లిని.. అన్నకు ఇలా దూరం చేశావేంటి దేవుడా..?

‘రాఖీ కట్టడానికి వస్తున్నా.. రెడీగా ఉండు’ అని చెప్పిన చెల్లిని.. అన్నకు ఇలా దూరం చేశావేంటి దేవుడా..?

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో చనిపోయిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ. వీళ్లలో విజయవాడకు చెందిన భావన తన అన్నకు రాఖీ కట్టేందుకు వెళుతుండగా ఇలా అర్థాంతరంగా తనువు చాలించే పరిస్థితి రావడం శోచనీయం.

విజయవాడకు చెందిన భావన బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వరుస సెలవులు రావడంతో రాఖీ పండుగ నాడు తన అన్నకు రాఖీ కట్టేందుకు సొంతూరుకు బయలుదేరారు.

బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి..  అక్కడి నుంచి విజయవాడకు ప్రైవేట్​బస్సులో బయలుదేరింది. ప్రయాణానికి ముందు కూడా తన అన్నతో వాట్సప్ కాల్ మాట్లాడిన భావన.. ఉదయం వరకు ఇంటికి వస్తా అని చెప్పింది. కానీ, ప్రమాదంలో ఐరన్ రాడ్డు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ‘రాఖీ కట్టడానికి వస్తున్నా.. రెడీగా ఉండు’ అని చెప్పిన చెల్లి చనిపోయిందన్న వార్త విన్న ఆమె అన్న కన్నీరుమున్నీరయ్యాడు.

కోదాడ మండలం ద్వారకుంట వద్ద నేషనల్​హైవే మీద ఆగి ఉన్న ఐరన్ లోడ్ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

హైదరాబాద్ నుంచి తెనాలికి ఐరన్ రాడ్ల లోడ్‌‌‌‌తో వెళ్తున్న లారీని.. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఫ్రెష్ బస్​ ట్రావెల్స్కు చెందిన ఎలక్ట్రిక్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ద్వారకుంట వద్ద ముందు వెళ్తున్న వెహికల్ను ఓవర్ టెక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.