న్యూఢిల్లీ : రాజస్తాన్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మ తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సందీప్ మెహతా తీవ్ర ఆరోపణలు చేశారు. జస్టిస్ శర్మను వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంతకు ఆయన వరుస లేఖలు రాశారు. రాష్ట్రం వెలుపల నుంచి ఒక చీఫ్ జస్టిస్ ను తక్షణమే నియమించాలని కోరారు.
యాక్టింగ్ చీఫ్ జస్టిస్ శర్మ హయాంలో తీవ్రమైన పరిపాలనాపరమైన అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా కేసులు కేటాయించడం వంటివి జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నెల 2, 10, 17వ తేదీల్లో ఈ మేరకు ఆయన సీజేఐకి మూడు లేఖలు రాశారు. జస్టిస్ శర్మ పరిపాలనా వైఫల్యాలు, అవకతవకలు, బంధుప్రీతి,పక్షపాత ధోరణికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
