కోటి జీతం ఉన్నా అమెరికా వేస్ట్.. ఇండియాలో రూ.25 లక్షలు ప్యాకేజీ బెస్ట్ అంటున్న NRI

కోటి జీతం ఉన్నా అమెరికా వేస్ట్.. ఇండియాలో రూ.25 లక్షలు ప్యాకేజీ బెస్ట్ అంటున్న NRI

అమెరికాలో సంపాదన కోట్లల్లో ఉన్నా.. చివరికి చేతిలో మిగిలేది మాత్రం శూన్యమేనా? సంపదతో పాటు కలల ప్రపంచంగా ఉన్న అగ్రరాజ్యంలో బతుకు బండి లాగడం ఎంత కష్టమో వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. అమెరికాలో గత 15 ఏళ్లుగా నివసిస్తున్న నితిన్ మల్హోత్రా అనే వ్యక్తి తన ఆర్థిక అనుభవాలను పంచుకుంటూ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతోంది. అమెరికాలో ఏడాదికి దాదాపు రూ. కోటి సంపాదిస్తున్నప్పటికీ.. భారత్‌లో రూ.25 లక్షల ప్యాకేజీతో పనిచేసినప్పుడే తాను ఎక్కువ మనీ సేవ్ చేయగలిగానని కుండబద్దలు కొట్టారు.

భారీ ఖర్చులు, పన్నులు..
అమెరికాలో నితిన్ మల్హోత్రా సంపాదిస్తున్న జీతం అక్కడి ఖర్చుల ముందు కరిగిపోతోందట. నెలకు వచ్చే సంపాదనలో ఎక్కువ మెుత్తం ఇంటి అవసరాలు, పన్నులకే సరిపోతుంది. నెలకు తనకు వచ్చే 8వేల డాలర్లలో హోమ్ లోన్ కింద సుమారు 2,500 డాలర్లు, ట్యాక్స్‌ల రూపంలో మరో 1,500 డాలర్లు కట్ అవుతాయి. ఇక 2 కార్ల ఇన్సూరెన్స్ కోసం 500 డాలర్లు, భార్యాపిల్లల హెల్త్ ఇన్సూరెన్స్ కి 500 డాలర్లు ఖర్చవుతున్నాయట. ఇవి కాకుండా కుటుంబ పోషణకు తిండి ఖర్చులు 1,000 నుంచి 1,200 డాలర్లు, మందులు ఇతర చిల్లర ఖర్చుల కింద మరో 500 నుంచి 800 డాలర్లు ఖర్చవుతాయని చెప్పాడు. ఇవన్నీ పోను చివరికి చేతిలో మిగిలేది కేవలం 1,000 నుంచి 1,200 డాలర్లు మాత్రమేనని వాపోయారు.

డే కేర్ ఖర్చులు తోడైతే..
ప్రస్తుతం నితిన్ భార్య ఉద్యోగం చేయడం లేదు కాబట్టి డే కేర్ ఖర్చులు తప్పాయని, ఒకవేళ ఆమె కూడా ఉద్యోగానికి వెళితే ఈ ఖర్చులు మరింత విపరీతంగా పెరుగుతాయని అన్నాడు. అమెరికాలో పిల్లల డే కేర్ బాధ్యతలు మోయడం సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఎంత భారంగా మారుతుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాగితంపై కనిపించే కోటి రూపాయల ప్యాకేజీ విదేశాల్లో జీవితాన్ని ఎంత క్లిష్టంగా మార్చేస్తుందో ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

►ALSO READ | ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంచలన నిర్ణయం.. వీసా అపాయింట్మెంట్లు నిలిపివేసిన అమెరికా

భారత్‌లో రూ.25 లక్షల సంపాదనే బెస్ట్..
అమెరికా జీవితాన్ని భారత్‌లోని తన గత పరిస్థితులతో నితిన్ బేరీజు వేసుకున్నారు. ఇండియాలో తాను సంవత్సరానికి రూ.25 లక్షలు సంపాదించిన రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో రూ.30వేల అద్దె ఇంట్లో ఉంటూ.. నచ్చిన తిండి తింటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా జీవించానని చెప్పారు. ఆ సంపాదనలోంచే నెలకు సుమారు రూ.లక్ష వరకు హ్యాపీగా సేవ్ చేసేవాడినని, భారత్‌లో డబ్బు దాచుకోవడం చాలా ఈజీ అని తేల్చిచెప్పారు.

నెటిజన్ల రియాక్షన్..
నితిన్ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ అమెరికాలో ఖర్చులు నిజంగానే ఎక్కువని మద్దతు తెలిపారు. మరికొందరు మాత్రం అమెరికాలో మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, మెరుగైన మౌలిక వసతులు, కాలుష్యం లేని వాతావరణం ఉంటాయని గుర్తుచేశారు. ఏదిఏమైనా విదేశీ కలలతో అగ్రరాజ్యానికి వెళ్లేవారికి.. అక్కడి ఆర్థిక వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో ఇది సూచిస్తోంది.