నీతికథ : చేప చేసిన సాయం..! అనాథను వ్యాపారిని చేసింది..

నీతికథ : చేప చేసిన సాయం..! అనాథను  వ్యాపారిని చేసింది..

అనాథ అయిన శంకరయ్యను జామ పండ్లు అమ్ముకునే రామయ్య తాత చేరదీసి పెంచి పెద్ద చేశాడు. అయితే శంకరయ్యకు పదిహేనేళ్ల వయసులో రామయ్య తాత అనారోగ్యంతో కన్నుమూశాడు. శంకరయ్య ఎంతో దిగులుపడ్డాడు. 

పొట్ట నింపుకోవడం కోసం సంతలో మూటలు మోసే పనికి వెళ్లాడు. అక్కడి వ్యాపారులు శంకరయ్యతో ఎక్కువ పని చేయించుకుని తక్కువ డబ్బులు ఇవ్వసాగారు.“అయ్యా! అందరికీ ఎక్కువ డబ్బులు ఇస్తూ, నాకు మాత్రం తక్కువ డబ్బులు ఇవ్వడం భావ్యం కాదు” అని శంకరయ్య అడిగాడు.

“డబ్బు ఎక్కువ ఇవ్వము. ఇష్టముంటే పని చెయ్యి. లేకపోతే వెళ్లిపో” అని వ్యాపారులు నిర్దాక్షిణ్యంగా సమాధానం ఇచ్చారు.

ఇదంతా గమనించిన రొట్టెలు అమ్మే అవ్వ శంకరయ్యను దగ్గరకు పిలిచింది.“నాయనా! ఇది కలికాలం. నోరున్నవాడిదే రాజ్యం. మీ రామయ్య తాతలా నువ్వూ జామపండ్లను బుట్టలో పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్ముకో. నీకు అప్పుగా వంద రూపాయలు ఇస్తాను” అని ధైర్యం చెప్పింది.

“అలాగే అవ్వా!” అని చెప్పి శంకరయ్య ఆమె దగ్గర వంద రూపాయలు తీసుకున్నాడు. వాటితో జామపండ్లు కొని బుట్టలో పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్మసాగాడు. సాయంత్రానికి పండ్లన్నీ అమ్ముడైపోయేవి. మంచి లాభం కూడా వచ్చేది. కొద్ది రోజుల్లోనే అవ్వ దగ్గర తీసుకున్న వంద రూపాయల అప్పును తీర్చేశాడు.

అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు శంకరయ్యకు దారిలో ఒక చెరువు కనిపించింది. అందులో చాలా చేపలు కనిపించాయి.“పాపం! వీటికి ఆహారం ఎలా దొరుకుతుందో?” అని ఆలోచించాడు.
ఆ రోజు నుంచి జామపండ్లు అమ్మిన తర్వాత సాయంత్రం అంగడికి వెళ్లి మరమరాలు కొనుక్కునేవాడు. చెరువు గట్టుకు చేరుకుని వాటిని చేపలకు ఆహారంగా వేసేవాడు. ఆ తర్వాత అవ్వ దగ్గర రెండు రొట్టెలు కొనుక్కుని తన గుడిసెకు వెళ్లేవాడు.

ఒక రోజు చేపల్లో ఒకటి శంకరయ్యతో మాట్లాడింది.“నీ పేరేంటో మాకు తెలియదు కానీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా మాకు ఆహారం పెడుతున్నావు. నీకు సాయం చేయాలని ఉంది” అని అంది.
“నా పేరు శంకరయ్య. నువ్వు నాకు ఎలాంటి సాయం చేయగలవు?” అని శంకరయ్య అడిగాడు.

ఆ చేప వెంటనే నీటిలోకి మునిగింది. కాసేపటి తర్వాత నోటితో ఒక బంగారు నాణెం పట్టుకుని ఒడ్డుకు వచ్చింది. ఆ నాణాన్ని శంకరయ్య ముందు ఉంచి, “ఈ బంగారు నాణాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో మంచి వ్యాపారం చేసుకో” అని చెప్పింది. 

శంకరయ్య ఆ నాణాన్ని తీసుకుని తనకు తెలిసిన ఒక పెద్ద మనిషితో కలిసి బంగారు అంగడికి వెళ్లాడు. అక్కడ ఆ నాణెన్ని అమ్మి వచ్చిన డబ్బుతో ఒక అంగడి పెట్టుకున్నాడు. అందులో రకరకాల పండ్లు అమ్మసాగాడు.కొన్ని నెలల్లోనే శంకరయ్య వ్యాపారం బాగా పుంజుకుంది. అతని పరిస్థితి మెరుగుపడింది. అది చూసి రొట్టెలు అమ్మే అవ్వ ఎంతో సంతోషించింది. అయితే వ్యాపారంలో తలమునకలై ఉన్నప్పటికీ, శంకరయ్య ప్రతిరోజూ సాయంత్రం చెరువు వద్దకు వెళ్లి చేపలకు ఆహారం వేయడం మాత్రం మానలేదు.ఒక రోజు శంకరయ్య చాలా సేపు ఆలోచించాడు.

“ఆ చేప నాకు సాయం చేసినట్టే, నేను కూడా మరొకరికి సాయం చేస్తే బాగుంటుంది” అని అనుకున్నాడు.వెంటనే బంగారు అంగడికి వెళ్లి ఒక బంగారు నాణెం కొన్నాడు. దాన్ని తీసుకుని చెరువు వద్దకు వెళ్లి ఆ చేపను పిలిచాడు. చేప బయటకు రాగానే తన మనసులోని మాట చెప్పి, బంగారు నాణాన్ని దాని నోటికి అందించాడు.

చేప ఆ నాణాన్ని తీసుకుని నీటిలోకి వెళ్లి దాచిపెట్టి తిరిగి శంకరయ్య దగ్గరకు వచ్చింది.
“నీ నిర్ణయం చాలా మంచిది. నువ్వు చేసిన ఈ మంచి పనికి తప్పకుండా మేలు జరుగుతుంది” అని చెప్పింది.

చేప మాటలు విన్న శంకరయ్య మనసు తేలికపడింది. సంతోషంగా తన అంగడికి తిరిగి వెళ్లాడు.
ఆ మాటలు విన్న శంకరయ్య మనసు ఆనందంతో నిండిపోయింది. తనకు కష్టకాలంలో రామయ్య తాత ఆశ్రయం ఇచ్చిన విషయాన్ని, అవ్వ తనకు వంద రూపాయలు అప్పుగా ఇచ్చి ఆదుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. తన జీవితంలో తనకు తోడుగా నిలిచిన వారిని ఎప్పటికీ మరచిపోకూడదని నిర్ణయించుకున్నాడు.

ఆ రోజు నుంచి శంకరయ్య తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఉపయోగించసాగాడు. తనకు వచ్చిన అవకాశాలను తనకే పరిమితం చేసుకోకుండా, ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేశాడు. అతని మంచితనం, నిజాయితీ, పరోపకారం గురించి ఊరంతా గొప్పగా చెప్పుకునేది.

- యు. విజయశేఖర రెడ్డి

గమనిక:  మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీ పత్రంతో పాటు[email protected] కి మెయిల్​ చేయండి.