పార్టీ అంటే ఏం గుర్తొస్తుంది? పెద్ద శబ్దంతో మోగే సంగీతం, డీజే పాటలు, డ్యాన్సులు, స్నేహితులతో సందడి.. కానీ ఇప్పుడు ఈ పార్టీ సంస్కృతికి కొత్త అర్థం చెప్తున్నారు కొందరు యువత. చేతిలో పుస్తకం పట్టుకుని, మసక వెలుతురులో, మృదువైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ చదువుకోవడమే వారి పార్టీ. ఈ కొత్త ట్రెండ్‌నే ‘రీడింగ్ రేవ్’ అంటున్నారు.
ఇటీవల జపాన్‌లోని టోక్యోలో జరిగిన ‘జ్యూసీ బుక్ రేవ్’ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. షిమోకిటాజావా ప్రాంతంలోని ‘స్ప్రెడ్’ అనే క్లబ్‌లో ఈ కార్యక్రమం జరిగినట్లు సమాచారం. అక్కడ యూత్ డాన్సులు చేయకుండా, తమకు నచ్చిన పుస్తకాలను చదువుతూ కనిపించారు. చుట్టూ మసక వెలుతురు, సౌకర్యంగా కూర్చునేందుకు ఏర్పాట్లు, బ్యాక్‌గ్రౌండ్‌లో మెలోడీ మ్యూజిక్.. ఇలా సాధారణ పార్టీకి భిన్నమైన వాతావరణం కనిపించింది.
నచ్చిన పుస్తకం.. నచ్చిన చోటు!
రీడింగ్ రేవ్ అంటే పుస్తక ప్రియుల కోసం నిర్వహించే ఓ ప్రత్యేక సమావేశం. ఇందులో పాల్గొనేవారు తమకు నచ్చిన పుస్తకాన్ని తీసుకొచ్చి, సౌకర్యంగా కూర్చుని చదువుకోవచ్చు. అందరూ ఒకే పుస్తకం చదవాలనే నిబంధన ఉండదు. నిర్ణీత సమయంలో ఇన్ని పేజీలు పూర్తి చేయాలనే ఒత్తిడీ ఉండదు. చదువుతున్నప్పుడు పక్కవారితో మాట్లాడాలనే నియమం కూడా లేదు. కొన్ని కార్యక్రమాల్లో కాఫీ, ఇతర పానీయాలు అందిస్తారు.
చదివే ముందు లేదా పూర్తయ్యాక కాసేపు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తారు. మరికొన్ని చోట్ల పుస్తకాల మార్పిడి, డైరీ రాయడం, బొమ్మలు గీయడం వంటి కార్యక్రమాలకూ చోటుంటుంది. ఒంటరిగా వచ్చినా, చుట్టూ ఇతర పుస్తక ప్రియులు ఉండటంతో ఓ సమూహంలో భాగమైన అనుభూతి కలుగుతుంది. ఈ విధానం జపాన్‌కే పరిమితం కాలేదు.
ఆమ్‌స్టర్‌డామ్‌లోని నెమో సైన్స్ మ్యూజియం దగ్గర జరిగిన పుస్తక పఠన కార్యక్రమం కూడా గతంలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ‘బుక్ డూఫ్’ పేరుతో బార్లు, గ్రంథాలయాలు వంటి భిన్నమైన ప్రదేశాల్లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఫోన్‌కు దూరంగా.. పుస్తకాలకు దగ్గరగా!
ఎప్పుడూ ఫోన్‌లో మునిగిపోవడం, అంతులేని సందేశాలు చూడటం, సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి గడపడం నేటి జీవితంలో భాగమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతసేపైనా డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండాలనే ఆలోచన యువతను ఆకర్షిస్తోంది. అందుకే పుస్తక పఠనాన్ని ఒంటరి అలవాటుగా కాకుండా, ఇతరులతో కలిసి ఆస్వాదించే అనుభవంగా మార్చుకుంటున్నారు.
సంప్రదాయ పుస్తక చర్చా వేదికలకు భిన్నంగా, కొత్త ప్రదేశాల్లో కొత్త పద్ధతుల్లో చదవడాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ ట్రెండ్ పుస్తక ప్రియులకు కొత్త స్నేహాలను పరిచయం చేయడమే కాకుండా, చదవడం అలవాటు లేనివారిలోనూ ఆసక్తి పెంచే అవకాశం ఉంది. మొత్తానికి వినోదం అంటే కేవలం పాటలు, డాన్సులే కాదు.. ప్రశాంతంగా పుస్తకం చదువుతూ గడిపే సమయం కూడా ఓ వేడుకే అని ఈ కొత్త ట్రెండ్ చెప్తోంది.
గమనిక:మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే..కథను హామీ పత్రంతో పాటు [email protected] కి మెయిల్ చేయండి.
