అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండో టర్మ్ లో ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కొనసాగుతున్న వలసల నియంత్రణ చర్యల్లో భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో అన్ని రకాల వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు మంగళవారం అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విదేశీ ప్రయాణికులు, వలసదారులు తీవ్ర ఆందోళన చెందుతున్న వేళ తాజా పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్లలో అధికారుల కోసం ప్రత్యేకంగా ఒక గ్లోబల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ శిక్షణకు అనుగుణంగానే ప్రస్తుతం షెడ్యూల్ చేసిన వీసా ఇంటర్వ్యూలను సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను మరింత గుర్తించడం, వీసా దరఖాస్తులను మరింత సమగ్రంగా పరిశీలించడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. అయితే ఈ ట్రైనింగ్ ఎన్నాళ్లు కొనసాగుతుందనే పూర్తి వివరాలను యూఎస్ అధికారులు వెల్లడించలేదు.
►ALSO READ | శ్రావణ శుక్రవారం ముందు గోల్డ్ సిల్వర్ బ్రేక్.. లేటు చేయకండి షాపర్స్.. హైదరాబాదాద్ రేట్లివే!
ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చట్టవిరుద్ధ వలసలను అణచివేయడమే కాకుండా.. చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను కూడా కఠినతరం చేస్తున్నారు. వీసాలు, గ్రీన్ కార్డులను రద్దు చేయడం, రాజకీయ అభిప్రాయాలు, గాజా యుద్ధంపై నిరసనల ఆధారంగా దరఖాస్తులను తిరస్కరించడం వంటి చర్యలు చేపట్టారు. అయితే ఈ విధానాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇటీవల 75 దేశాల నుంచి వచ్చే వలసదారుల వీసాలను నిలిపివేస్తూ ట్రంప్ సర్కార్ తెచ్చిన విధానాన్ని ఒక యూఎస్ ఫెడరల్ జెడ్జ్ కొట్టివేశారు. ఇది సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అధికార పరిధిని మించి ఉందని పేర్కొన్నారు.
ట్రంప్ సర్కార్ అమలు చేస్తున్న ఈ కఠిన నిబంధనలపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇవి వివక్షపూరితంగా ఉన్నాయని, భావప్రకటన స్వేచ్ఛను, పౌరుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని మండిపడ్డాయి. జాతి వివక్ష, ప్రొఫైలింగ్ కారణంగా అమెరికాలో ముఖ్యంగా మైనారిటీలకు అభద్రతా భావం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల సమయంలో అక్రమ వలసలను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన ట్రంప్.. ఇప్పుడు ఖరీదైన వర్క్ వీసా ఫీజుల ద్వారా చట్టబద్ధమైన వలసలను సైతం కష్టతరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
