క్రికెట్ ఆడేందుకు భారత్ వద్దంది.. మరో దేశం అక్కున చేర్చుకుంది: అనయా బంగర్ ఎమోషనల్

క్రికెట్ ఆడేందుకు భారత్ వద్దంది.. మరో దేశం అక్కున చేర్చుకుంది: అనయా బంగర్ ఎమోషనల్

Anaya Bangar: టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగార్ కుమార్తె అనయా బంగర్ (Anaya Bangar) మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టబోతోంది. జెండర్ మార్పిడి (Gender Transition) తర్వాత ఎలిజిబిలిటీ నియమాలతో కొన్ని రోజులుగా ఆటకి దూరమైన ఆమెకి, ఆస్ట్రేలియాలో ఫిమేల్ కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నుంచి పర్మిషన్ లభించింది. ఇది ఇంకా ప్రొఫెషనల్ లేదా ఎలైట్ లెవెల్ క్రికెట్ కాకపోయినా, ఆమె కెరీర్‌కి ఇది చాలా కీలకమైన మలుపు అని చెప్పవచ్చు.

నేను మళ్లీ క్రికెట్ ఆడతాననుకోలేదు: అనయా బంగర్- 

ఆస్ట్రేలియా క్లియరెన్స్ ఇవ్వడంపై స్పందిస్తూ అనయా బంగర్ సంతోషం వ్యక్తం చేసింది. మళ్లీ నేను క్రికెట్ గ్రౌండ్‌లోకి అడుగుపెడతానని అస్సలు అనుకోలేదు.. నా ఆశలన్నీ చచ్చిపోయిన సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా నాకు ఈ రెండో అవకాశం కల్పించింది. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అని భావోద్వేగానికి గురైంది. ఈ ఏడాది ప్రారంభంలో థాయిలాండ్‌లో జెండర్-అఫర్మింగ్ సర్జరీ (Vaginoplasty) చేయించుకున్న ఆమె, ప్రస్తుతం ఆ గాయాల నుంచి కోలుకుంటూ మళ్లీ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడుతోంది.

WBBL కల నెరవేరుతుందా? బిగ్ టెస్ట్ ఇంకా బాకీ ఉందే: 

ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ క్రికెట్ ఆడుతూనే, రాబోయే రోజుల్లో ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) లాంటి ఎలైట్ టోర్నీల్లో ఆడాలని అనయా బంగర్ టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ ఎలైట్ లెవెల్‌కి చేరడం అంత సులువు కాదు. ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం పురుషుల ప్యూబర్టీ దాటిన ట్రాన్స్‌జెండర్లు మహిళల క్రికెట్ ఆడటంపై బ్యాన్ ఉంది. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా రూల్స్ ప్రకారం కనీసం 12 నెలల పాటు సీరమ్ టెస్టోస్టెరాన్ స్థాయిలు 10 nmol/L కంటే తక్కువగా ఉండాలి.. మార్చి 2027 నాటికి బ్లడ్ టెస్టుల్లో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ నిరూపించుకుంటేనే ఆమె ఎలైట్ క్రికెట్‌కి అర్హత సాధిస్తుందని బోర్డు స్పష్టం చేసింది.

ఇండియాలో ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు: 

గతంలో అనయా బంగర్ (ఆర్యన్) ముంబై అండర్-19 టీమ్ తరపున సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లతో కలిసి క్రికెట్ ఆడింది. జెండర్ ఛేంజ్ తర్వాత తన మెడికల్ రిపోర్ట్స్‌ను బీసీసీఐ (BCCI) కి పంపినా బోర్డు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం సమన్యాయం (Fairness), కలుపుగోలుతనం (Inclusivity) ప్రాతిపదికన ఆమె మెడికల్ హిస్టరీని పరిశీలించి ఆడేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో వచ్చే ఏడాది మార్చి వరకు ఆస్ట్రేలియాలో ఏ స్టేట్‌లోనైనా కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు అనయా బంగర్ కి లైన్ క్లియర్ అయింది.