సూర్యపేట నుంచి ఫార్మా కంపెనీని తరలించాలి : జేఏసీ

 సూర్యపేట నుంచి ఫార్మా కంపెనీని తరలించాలి : జేఏసీ

సూర్యాపేటలోని శాంతి నగర్ నుంచి  కోహాన్స్ లైఫ్‌సైన్సెస్ ఫార్మా కంపెనీని తరలించాలని జాయింట్ యాక్షన్ కమిటీ  (జేఏసీ) డిమాండ్ చేసింది. ఫార్మా యూనిట్ నుంచి  వెలువడుతున్న రసాయన కాలుష్యం వల్ల చుట్టుపక్కల కాలనీల ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని జేఏసీ ఆరోపించింది.

 కంపెనీ చుట్టుపక్కల ఉన్న కాలనీలలో దాదాపు సగం జనాభా కాలుష్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని... 40 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ యూనిట్, పట్టణ విస్తరణ కారణంగా ప్రస్తుతం నివాస ప్రాంతాల మధ్యకు వచ్చిందన్నారు. 

 నివాసితుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఫార్మా కంపెనీని వెంటనే నివాస ప్రాంతాల నుంచి దూరంగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  కంపెనీ తరలింపును కోరుతూ త్వరలోనే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు జేఏసీ ప్రకటించింది. ఎస్‌వీకే గ్రాండ్ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో జేఏసీ నాయకుడు కె. శివ రామ్, 18వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, పలు కాలనీల ప్రజలు పాల్గొన్నారు.