- ఇప్పటివరకు 8.2 టీఎంసీలు లిఫ్ట్
- 22 రిజర్వాయర్లకు జలకళ, 3.16 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు
- అక్టోబర్ వరకూ పంపింగ్ చేస్తామంటున్న ఆఫీసర్లు
హనుమకొండ/జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో దేవాదుల ఎత్తిపోతల పథకం రైతులకు వరప్రదాయినిగా మారింది. దేవాదుల ప్రాజెక్టు మోటార్లను నెల రోజులుగా నిరంతరాయంగా నడిపిస్తూ గోదావరి లోకి వచ్చిన నీటిని వచ్చినట్లే ఎత్తిపోస్తున్నారు.
దీంతో దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని భీమ్ ఘన్ పూర్ నుంచి తపాస్ పల్లి వరకు ఉన్న 22 రిజర్వాయర్లు జల కళను సంతరించుకోవడంతో పాటు వాటి కింద ఉన్న 3.16 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందుతున్నాయి.
తొమ్మిది మోటార్ల ద్వారా ఎత్తిపోతల
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై 2004లో జువ్వాడి చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గోదావరి నుంచి 38.16 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 6.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని నీళ్లను ఎత్తిపోసేందుకు గంగారం ఇన్ టెక్ పాయింట్ వద్ద పది మోటార్లను ఏర్పాటు చేశారు.
కానీ ఇందులో ఒక మోటార్ టెక్నికల్ సమస్యల కారణంగా ఆగిపోగా మిగతా తొమ్మిది మోటార్లతో నిత్యం 2,650 క్యూసెక్కుల నీటి ఎత్తి పోస్తున్నారు. దీంతో గోదావరి నుంచి భీమ్ ఘన్ పూర్, రామప్ప, లక్నవరం, పాకాల, ధర్మసాగర్ మీదుగా ఆర్ ఎస్ ఘన్ పూర్, అశ్వరావుపల్లి, గంగడిరామారం, బొమ్మకూరు, తపాస్ పల్లి వరకు ఉన్న రిజర్వాయర్లలోకి నీళ్లు చేరుతున్నాయి.
నెల రోజుల్లో 8.2 టీఎంసీలు
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనప్పటికీ.. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఆ నీటి వినియోగంపై ఫోకస్ చేసిన ప్రభుత్వం సాధ్యమైనంత వరకు లిఫ్ట్ చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది.
దీంతో ఆఫీసర్లు గత నెల 15 నుంచి ఎత్తిపోతలు స్టార్ట్ చేశారు. గోదావరిలో లభ్యతను బట్టి నీటిని ఎత్తి పోస్తున్నారు. ఇలా గడిచిన నెల రోజుల్లో 8.2 టీఎంసీలను ఎత్తిపోయగా.. ప్రాజెక్టు పరిధిలోని 22 రిజర్వాయర్లలో 60 నుంచి 70 శాతం వరకు నీళ్లు చేరాయి. అయితే వేసవిలో చాలా వరకు రిజర్వాయర్లు ఎండిపోవడం, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడం కారణంగా ప్రస్తుతం రిజర్వాయర్లలోకి చేరుతున్న నీరు ఇంకిపోతోందని ఆఫీసర్లు అంటున్నారు.
3.16 లక్షల ఎకరాలకు నీరు
రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గిపోవడం, సాగుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ జరిపారు. దేవాదుల నుంచి సెప్టెంబర్ చివరి దాకా నీటిని లిఫ్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు నీటిని ఎత్తిపోయడంతో పాటు సాగుకు విడుదల చేయడంపై ఫోకస్ పెట్టారు.
ఇప్పటికే దేవాదుల ప్రాజెక్టులో కీలకమైన ధర్మసాగర్ రిజర్వాయర్ దాదాపు 80 శాతం నిండగా.. అక్కడి నుంచి ఆర్ఎస్ ఘన్ పూర్, గండిరామారం ద్వారా తపాస్ పల్లి వరకు పంపింగ్ చేస్తున్నారు. సౌత్ మెయిన్ కెనాల్, నార్త్ మెయిన్ కెనాల్ ద్వారా సాగుకు నీటిని విడుదల చేశారు.
దేవాదుల ప్రాజెక్టు పరిధిలో దాదాపు 2,400కుపైగా చెరువులు ఉండగా.. వాటిలో చాలావరకు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టు ద్వారా దాదాపు 3.16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుండడం, పంటలన్నీ కళకళలాడుతుండంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
అక్టోబర్ వరకు ఎత్తిపోస్తం
గోదావరి నుంచి దేవాదుల ప్రాజెక్టు ద్వారా 9 మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నాం. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగానే ఉంది. గోదావరిలో నీటి లభ్యతను బట్టి అక్టోబర్ వరకు ఎత్తిపోస్తాం. సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
– ఆర్.సుధీర్, సీఈ, దేవాదుల
