అహ్మదాబాద్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ తుది దశకు చేరుకున్నది. రాబోయే నాలుగు నెలల్లో గగన్‌యాన్ తొలి మానవరహిత (అన్‌క్రూడ్) రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ ప్రకటించారు.
అహ్మదాబాద్‌లో ఘనంగా నిర్వహించిన మూడో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ కీలక వివరాలను వెల్లడించారు. సైకిళ్లు, ఎడ్లబండ్లపై రాకెట్ విడిభాగాలను మోసిన స్థాయి నుంచి నేడు చంద్రుడు, శుక్ర గ్రహాల వైపు దూసుకెళ్లే స్థాయికి భారత్ ఎదిగిన ప్రస్థానాన్ని ఆయన గర్వంగా గుర్తుచేశారు.
‘‘మేం ప్రస్తుతం తుది దశలో ఉన్నాం. ఇప్పటివరకు 8వేల క్లిష్టమైన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాం. వ్యోమగాములను పంపే ముందు మూడు మానవరహిత ప్రయోగాలను చేపడతాం. అందులో మొదటి ప్రయోగాన్ని వచ్చే 4 నెలల్లో చేపట్టనున్నాం’’ అని స్పష్టం చేశారు. మానవ ప్రాణాలకు ఎలాంటి రిస్క్ లేకుండా, రాకెట్ పనితీరును అంచనా వేయడానికే ఈ మానవరహిత ప్రయోగాలు చేపడుతున్నట్టు చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 8 ప్రయోగాలు..
ఈ ఆర్థిక సంవత్సరంలో 8 రాకెట్ ప్రయోగాలతో 12 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చాలని నిర్దేశించుకున్నట్టు వి.నారాయణన్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌కు 56 అంతరిక్ష ఆస్తులు (శాటిలైట్లు) ఉన్నాయని, రాబోయే ఐదేండ్లలో 200 నుంచి 300 ఉపగ్రహాలు అవసరమని ఆయన తెలిపారు. ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.
2020 సంస్కరణల తర్వాత దేశంలో స్పేస్ స్టార్టప్‌ల సంఖ్య ఏకంగా 440కి చేరిందని, స్కైరూట్ ఏరోస్పేస్ సాధించిన ‘విక్రమ్-1’ ఆర్బిటల్ విజయం ప్రైవేటు రంగ సత్తాకు నిదర్శనమని కొనియాడారు. 2035 నాటికి అంతరిక్షంలో భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్) నిర్మిస్తామని చెప్పారు. చంద్రయాన్-4, చంద్రయాన్-5, వీనస్ (శుక్ర గ్రహం) మిషన్, భవిష్యత్ మార్స్ ల్యాండింగ్ ప్రణాళికలపై ఇస్రో ముమ్మర కసరత్తు చేస్తున్నదని తెలిపారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగుపెడతాడని ఆయన పేర్కొన్నారు.
