హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో మరో అక్రమ నిర్మాణం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. భారీ బాహుబలి యంత్రంతో ఆరు అంతస్తుల భవనం కూల్చివేయాలని నిర్ణయించారు. భారీ బాహుబలి యంత్రం ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుంది. అధికారులు మరికొద్దిసేపట్లో కూల్చివేత పనులు ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నాలాను ఆక్రమించి ఎలాంటి అనుతులు లేకుండా కేవలం 55 గజాల్లో చేపట్టిన 7 అంతస్తుల అక్రమ భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. భవనంలో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకొని దుర్మరణం చెందగా, వారి మృతదేహాలను బయటకు తీశారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేశ్(34), మొహబ్బత్(42)గా గుర్తించారు.
ఈ ఇంటిని సాజిద్ అనే బిల్డర్ నాలాను ఆక్రమించి మరీ కట్టినట్టుగా గుర్తించారు. కేవలం 55 గజాల స్థలంలోనే ఏడు అంతస్తుల భవనం నిర్మించగా, ప్రస్తుతం భవనంలో టైల్స్ పనులు సాగుతున్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అగ్గిపెట్టెలు పేర్చినట్టుగా కట్టడంతో భవనం శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం గురించి తెలియగానే హైడ్రా డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని శిథిలాల తొలగింపు చేపట్టాయి.
►ALSO READ | హైదరాబాద్ను కమ్మేసిన వాన ముసురు.. ఈ ఏరియాల్లో పొట్టుపొట్టు కొడుతున్న వర్షం
కుప్పకూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న వైట్‌ఫీల్డ్ జయదర్శిని రెసిడెన్సీలోని సీ బ్లాక్ అపార్ట్‌మెంట్‌పై పడడంతో అందులో ఉంటున్న ఆర్మీ మాజీ ఉద్యోగి రమణారెడ్డి, ఆయన భార్య సంయుక్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో సీ బ్లాక్‌లోని ఐదు ఫ్లాట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్తగా సీ బ్లాక్‌లోని అన్ని ఫ్లాట్లనూ పోలీసులు ఖాళీ చేయించారు. కూలిన భవనానికి ఇరువైపులా ఉన్న మరో రెండు భవనాలకు కూడా పగుళ్లు ఏర్పడడంతో.. ఎప్పుడు కూలిపోతాయోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఆ రెండు భవనాల్లో హాస్టళ్లు కొనసాగుతుండగా, పోలీసులు వాటిని కూడా ఖాళీ చేయించారు.
