కృష్ణాకు మరో బొక్క! ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న ఏపీ సీఎం 

కృష్ణాకు మరో బొక్క! ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న ఏపీ సీఎం 
  • ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న ఏపీ సీఎం 
  • వరదల టైమ్​లో నీటిని తరలించుకునేందుకు ఆంధ్రప్రదేశ్​కు రాచమార్గం 
  • తొలి ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఫస్ట్​ టన్నెల్​ నుంచి 10.5 టీఎంసీల తరలింపు
  • రెండో ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండో టన్నెల్​ ద్వారా 33 టీఎంసీలు మళ్లించేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాలకు ఏపీ మరో బొక్కపెట్టేందుకు సిద్ధమైపోయింది. వరదల టైంలో వచ్చిన నీటిని వచ్చినట్టే మళ్లించుకునేందుకు ఏపీకి రాచమార్గం తయారైంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి డెడ్​స్టోరేజ్‌‌కు దిగువ నుంచి నీటిని తన్నుకుపోతున్న ఆ రాష్ట్రం.. తాజాగా వెలిగొండ ప్రాజెక్టుతో మరిన్ని నీళ్లను కాజేసేందుకు రెడీ అవుతున్నది. వెలిగొండ ప్రాజెక్ట్​ ఫస్ట్​ ఫేజ్‌‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 31న ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్​ ద్వారా వరద రోజుల్లో 10.5 టీఎంసీలను ఏపీ తరలించుకుపోనున్నది. ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం, కడప జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వనున్నారు. తొలి ఫేజ్‌‌లో భాగంగా 1.19 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు.. 4 లక్షల మందికి తాగునీటిని సరఫరా చేసేలా ఈ ప్రాజెక్టును డిజైన్​ చేశారు. 

ఆగుతూ.. సాగుతూ..  

1996లో ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వెలిగొండ ప్రాజెక్టుకు బీజం పడింది. శ్రీశైలం బ్యాక్​ వాటర్‌‌‌‌ నుంచి నీటిని తీసుకెళ్లేందుకు చంద్రబాబే తొలిసారి శంకుస్థాపన చేశారు. కానీ, ఆ తర్వాత అది ముందుకు సాగలేదు. వైఎస్​ రాజశేఖర్‌‌‌‌ రెడ్డి 2004లో సీఎం అయ్యాక మరోసారి దానిని పట్టాలెక్కించి.. అదే ఏడాది అక్టోబర్‌‌‌‌లో శంకుస్థాపన చేశారు. తొలి టన్నెల్​ పనులను 2008లో వైఎస్​ ప్రారంభించారు. రెండో టన్నెల్​ పనులకు 2009లో అప్పటి ఇరిగేషన్​ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శంకుస్థాపన చేశారు. రెండు టన్నెల్స్​ ద్వారా వరద రోజుల్లో 45 రోజులపాటు 43.5 టీఎంసీల జలాలను నల్లమలసాగర్‌‌‌‌కు తరలించి.. అక్కడి నుంచి కరువు జిల్లాలకు నీటిని పంపిణీ చేసేలా డీపీఆర్​తయారు చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్​ బ్యాక్​ వాటర్​ నుంచి 7 మీటర్ల వ్యాసంతో ఒక టన్నెల్​, 9.2 మీటర్ల వ్యాసంతో మరో టన్నెల్‌‌ను నిర్మించి 19 కిలోమీటర్ల దూరంలోని కొల్లం వాగులోకి నీళ్లను మళ్లించనున్నారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని వెలిగొండ ప్రాజెక్టుకు రెండు వరద కాల్వల ద్వారా జలాలను తీసుకుపోనున్నారు. తొలి టన్నెల్​ నుంచి 10.5 టీఎంసీలు, రెండో టన్నెల్​ నుంచి 33 టీఎంసీల మేర నీటిని తరలించేందుకు కసరత్తు చేశారు. మళ్లీ వివిధ కారణాలతో ఆ ప్రాజెక్ట్​ ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన తర్వాత జగన్​ సీఎం అయ్యాక 2020లోనే మళ్లీ దానిని పట్టాలెక్కించారు. తాజాగా ఇప్పుడు తొలి ఫేజ్‌‌ను పూర్తి చేసేశారు. 

రెండో దశ పూర్తయితే అంతే..

మొదటి దశలో 10.5 టీఎంసీలే తరలించాలని భావిస్తున్నా.. రెండోది కూడా పూర్తయితే ఏపీ జలదోపిడీకి పట్టపగ్గాల్లేకుండా పోతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు పోతిరెడ్డిపాడునే మన ఇంజినీరింగ్‌‌ నిపుణులు ఉదాహరణగా చూపిస్తున్నారు. 4 వెంట్లతో ప్రారంభమైన హెడ్​ రెగ్యులేటర్‌‌‌‌ను 11 వెంట్లకు పెంచిన సంగతి తెలిసిందే. 11,500 క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు.. ఆ తర్వాత లక్షన్నర క్యూసెక్కులు తరలించేలా పోతిరెడ్డిపాడును ఎలా పెంచేశారో గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టును కూడా అలా చేసే అవకాశాలు లేకపోలేదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా రెండు దశలు పూర్తయితే 43.5 టీఎంసీలతో 4.7 లక్షల ఎకరాలకు నీళ్లు, 23 లక్షల మందికి తాగునీళ్లు అందించేలా ఏపీ కసరత్తు చేస్తున్నది.