రాఖీ పండుగ విషయంలో ఈ ఏడాది చాలా గందరగోళం ఉంది. శ్రావణపూర్ణిమ తిథి రెండు రోజులు ఉండటం.. అదే రోజు చంద్రగ్రహణం ఏర్పడటంతో చాలా మంది అయోమయంలో ఉన్నారు. గ్రహణ సమయంలో రక్షాబంధనం కట్టవచ్చా.. కట్టకూడదా.. దీనికి సంబంధించి పండితులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ..
ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరంలో చివరి సంపూర్ణ చంద్రగ్రహణం రాఖీ పౌర్ణమి తిథి నాడే రాబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి సమయంలోనే గ్రహణం ప్రారంభం కానుండటంతో దైవకార్యాలు, శుభకార్యాలు మరియు సూతక కాలం నియమాలపై భక్తుల్లో అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
రక్షాబంధన్ రోజే బ్లడ్ మూన్ కనువిందు చేయనుండటంతో రాఖీ ఎప్పుడు కట్టాలి? అసలు మన దేశంలో ఈ గ్రహణ ప్రభావం ఉంటుందా? అనే గందరగోళం మొదలైంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం రక్షాబంధన్ రోజే అంటే 2026 ఆగస్టు 28న చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. కన్యారాశిలో సంభవించే ఈ చంద్రగ్రహణం ఉదయం 8:04 గంటల నుంచి 11:22 గంటల వరకు కొనసాగుతుంది.
మనదేశంలో కనపడుతుందా
ఆగస్టు 28 న ఏర్పడే చంద్ర గ్రహణం ఖగోళ శాస్త్రవేత్తలు .. వేద పండితుల ప్రకారం మన దేశంలో ఎక్కడా కనిపించదు. ఇక శాస్త్ర నియమాల ప్రకారం భారతదేశంలో కనిపించని గ్రహణానికి ఎలాంటి సూతక కాలం గానీ, వేధ గానీ వర్తించవు. ఎలాంటి ఆందోళన లేకుండా నిర్ణయించిన శుభ ముహూర్తాల్లో రాఖీ కట్టుకోవచ్చని చెబుతున్నారు. ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, పసిఫిక్ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది.
మన దేశంలో గ్రహణ ప్రభావం .. సూతక కాలం లేకపోవడం వల్ల రాఖీ పండుగను ఎలాంటి భయం లేకుండా ఆనందంగా జరుపుకోవచ్చని వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. అయితే సంప్రదాయాలను పాటించేవారు ఉదయాన్నే తలస్నానం చేసి దైవ ప్రార్థన ముగించుకుని, ప్రశాంతంగా తమ సోదరులకు రాఖీలు కట్టాలని సూచిస్తున్నారు
రాఖీ పౌర్ణమి నాడే చంద్రగ్రహణం వస్తున్నప్పటికీ, మన దేశంలో దాని ప్రభావం లేనందున అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు నిరభ్యంతరంగా రాఖీలు కట్టి పండుగను సంతోషంగా జరుపుకోవచ్చు. సోదరభావానికి ప్రతీకైన ఈ పండుగను ఎలాంటి గందరగోళం లేకుండా ఆనందంగా జరుపుకోండి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
