అమెరికా H-1B కొత్త బిల్లు: రూల్స్ ఫాలో కాకుంటే రెండున్నర లక్షల డాలర్లు ఫైన్

అమెరికా H-1B కొత్త బిల్లు: రూల్స్ ఫాలో కాకుంటే రెండున్నర లక్షల డాలర్లు ఫైన్

అమెరికా H-1B వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ.. అక్రమాలకు పాల్పడే వారిపై భారీ జరిమానాలు విధించేలా టెక్సాస్ ప్రతినిధి బెత్ వాన్ డూయెన్ 'హెచ్-1బి వీసా ఫ్రాడ్ క్రాక్‌డౌన్ యాక్ట్' బిల్లును ప్రవేశపెట్టారు. దీని కింద వీసా నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలు, యజమానులపై జరిమానాల మోత మోగనుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేసి, విదేశీ కార్మికుల నియామకాల్లో పారదర్శకతను పెంచేందుకు కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు.

ఈ కొత్త బిల్లులో భాగంగా తీవ్రమైన హెచ్-1బి రూల్స్ ఉల్లంఘనలకు గరిష్ట జరిమానాను ప్రస్తుతమున్న 35వేల డాలర్లను ఏకంగా 2లక్షల 50వేల డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. అంటే భారతీయ కరెన్సీలో ఫైన్ మెుత్తం రూ.2కోట్ల 37లక్షలకు పైన ఉండనుంది. అలాగే ఉల్లంఘనలకు పాల్పడిన వారు ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా విధించే నిషేధ కాలాన్ని 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచనుంది అమెరికా.

మరో రకమైన ఉల్లంఘనల విషయానికి వస్తే.. జరిమానా మొత్తాన్ని 5వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు (రూ. 4లక్షల 75వేల నుంచి రూ. 95లక్షలకు) పెంచాలని సూచించారు. దీనికి సంబంధించి ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాల నుంచి బహిష్కరించే కనీస కాలపరిమితిని 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పొడిగించనున్నారు. ఇమ్మిగ్రేషన్ దస్త్రాల ఫోర్జరీ కేసుల్లో కూడా జరిమానాలను భారీగా పెంచాలని సెక్షన్ 274సి సవరణ ద్వారా ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదిత చట్టం ద్వారా మొదటి కేటగిరీ డాక్యుమెంట్ ఫ్రాడ్‌కు జరిమానాను 1,000 - 10,000 డాలర్ల వరకు (రూ. 95వేల నుంచి రూ. 9లక్షల 50వేలు) ఉండగా, అత్యంత తీవ్రమైన రెండవ కేటగిరీకి 20వేల - 50వేల డాలర్ల వరకు (రూ. 19లక్షల నుంచి రూ. 47లక్షల 50వేలు) ఉండనుంది. ప్రస్తుతం ఈ బిల్లు హౌస్ జ్యుడీషియరీ కమిటీ పరిశీలనలో ఉంది. ఇది చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ, సెనేట్ ఆమోదం పొంది.. ఆ తర్వాత దేశాధ్యక్షుడి సంతకం కావాల్సి ఉంటుంది. అప్పటివరకు పాత హెచ్1బి వీసా రూల్స్ అమల్లో ఉంటాయి.