విశాఖ నేవీ సిబ్బందిని టార్గెట్ చేసిన పాక్ టెర్రరిస్టులు : ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ నిఘాలో వెలుగులోకి

విశాఖ నేవీ సిబ్బందిని టార్గెట్ చేసిన పాక్ టెర్రరిస్టులు : ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ నిఘాలో వెలుగులోకి

అమరావతి: పాకిస్తాన్‌కు రక్షణ సంబంధిత కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న అనుమానాలతో సాగుతున్న గూఢచర్య వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఛేదించింది. ‘ఆపరేషన్ ఫైర్ వాల్-2026’ పేరుతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

విశాఖపట్నం కేంద్రంగా సాగినట్లు అనుమానిస్తున్న ఈ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కొంతకాలంగా నిఘా పెట్టారు.  పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగిస్తూ రక్షణ రంగానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న అనుమానాలపై దర్యాప్తు చేసింది.

ఈ కేసులో 13 మంది నావికాదళ సిబ్బంది సహా మొత్తం 18 మందిపై నిఘా పెట్టింది. . వీరికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో రహస్య సంబంధాలు ఉన్నాయా? రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా చేరవేశారా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేసింది. దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి  ఇద్దరిని అరెస్ట్ చేసింది. 

గూఢచర్య నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తూ అనుమానితుల కదలికలు, కమ్యూనికేషన్లు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు దృష్టి సారించింది. విశాఖపట్నం కేంద్రంగా ఈ నెట్‌వర్క్ కార్యకలాపాలు సాగినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో నిందితులు ఎలా సంప్రదింపులు జరిపారు? వారికి ఎలాంటి సమాచారం చేరింది? అనే అంశాలపై ఆధారాలను సేకరిస్తున్నారు. 

ALSO READ : జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు కదిలేది లేదు

ఈ గూఢచర్య నెట్‌వర్క్‌లో ఎన్‌క్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్, డిజిటల్ కమ్యూనికేషన్ మార్గాలను ఉపయోగించి సమాచారాన్ని చేరవేసినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేశారా అనే కోణంలో అధికారులు ఆధారాలను పరిశీలిస్తున్నారు.