రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కొమ్ము వెంకమ్మకు ఎడమ కంటికి శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా, ప్రైవేట్ ఆసుపత్రిలో పొరపాటున కుడి కంటికి శస్త్రచికిత్స చేశారన్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్సీ) సుమోటోగా కేసు స్వీకరించింది.
ఈ ఘటనపై వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఆరోపణలు నిజమని తేలితే వైద్య నిర్లక్ష్యంతో పాటు రోగి భద్రతకు సంబంధించిన అంశాలపై తీవ్ర ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందని కమిషన్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో శస్త్రచికిత్సకు సంబంధించిన వైద్య రికార్డులు, బాధితురాలి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఘటనపై చేపట్టిన విచారణలో వెల్లడైన అంశాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)ను కమిషన్ ఆదేశించింది.
నివేదికను నవంబర్ 6లోగా సమర్పించాలని టీజీహెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశాలు జారీ చేశారు. కమిషన్ ఆదేశాలతో ఈ ఘటనపై వైద్యపరమైన నిర్లక్ష్యం జరిగిందా? అనే అంశంపై అధికారిక విచారణకు మార్గం సుగమమైంది.
