సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసులు వెరీ స్లో ..92.87 లక్షల్లో ఇచ్చింది 18 లక్షల మందికే 

సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నోటీసులు వెరీ స్లో ..92.87 లక్షల్లో ఇచ్చింది 18 లక్షల మందికే 
  • ప్రింటింగ్​ తిప్పలు.. సాంకేతిక అడ్డంకులు
  • లిస్టులో పేరుందో లేదో తెలియక గందరగోళం
  • నోటీసు అందిన ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలి
  • పౌరసత్వ అనుమానాలు ఉంటే స్పెషల్ ఎంక్వైరీ
  • అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 15లోపు సవాల్​గా మారిన ప్రక్రియ పూర్తి


హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​ (సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో కీలకమైన నోటీసుల పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత లాంటి  లోపాల కారణంగా లక్షలాది మంది ఓటర్లకు ఇంకా నోటీసులు చేరలేదు. వాస్తవానికి ఈ నెల 17వ తేదీ నుంచే నోటీసులు ఆయా ఓటర్లకు అందజేయాల్సి ఉంది. ముసాయిదా జాబితాలో ఉన్న మొత్తం 2 కోట్ల 64 లక్షల 87 వేల213 మంది ఓటర్లలో ఏకంగా 92 లక్షల 87 వేల 577 (35.06 శాతం) మందికి  నోటీసులు ఇవ్వాల్సి ఉండగా,  ఇప్పటివరకూ 60 లక్షల నోటీసులు మాత్రమే ముద్రించినట్టు అధికారులు ప్రకటించారు.

ఇందులో కేవలం 20 శాతంలోపే నోటీసులు ఓటర్లకు అందజేయడం ఆందోళన కలిగిస్తున్నది.  అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 నాటికే ఈ నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాల్సి ఉంది.  ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లకు నోటీసులు ఇచ్చి, వారి వివరణ రికార్డు చేసి విచారణ చేపట్టేందుకు చాలా సమయం తీసుకుంటుంది. కానీ వారం గడుస్తున్నా నోటీసుల ప్రింటింగ్, పంపిణీ చేయడంలో ఎన్నికల యంత్రాంగం వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చే అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణను సమాంతరంగా చేపడుతూనే.. ఈ నోటీసుల వ్యవహారాన్ని తేల్చాల్సి రావడం అధికారులకు పెను సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది.  

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్లారిటీ అంతంతే.. 

రాష్ట్రవ్యాప్తంగా అనామలీస్ లిస్ట్​లో ఉన్న 92 లక్షలకుపైగా ఓటర్లకు నోటీసులు ఇస్తామని ఈసీ వెల్లడించినప్పటికీ.. ఆ జాబితాలో అసలు తమ పేరు ఉందో లేదో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. నోటీసుల వివరాలను ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరిశీలించుకునే విధానంపై క్షేత్రస్థాయిలో చాలా మంది ఓటర్లకు అవగాహన లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. 

ఒకవేళ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు పోర్టల్‌‌లోకి వెళ్లి చూసినప్పటికీ.. అందులో కేవలం ‘అనామలీస్‌‌’లో పేరు ఉందనే ఒక చిన్న ఇండికేషన్‌‌ మాత్రమే కనిపిస్తోంది తప్ప ఇతర వివరాలేవీ తెలియడం లేదు. తమ వివరాల్లో అసలు ఎలాంటి తప్పులు దొర్లాయన్న స్పష్టత లేకపోవడంతో ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇక ‘నో మ్యాపింగ్‌‌’  ఓటర్ల విషయంలోనైతే ఆన్‌‌లైన్‌‌లో ఆ మాత్రం క్లారిటీ కూడా లభించడం లేదని ఓటర్లు గగ్గోలు పెడుతున్నారు. నోటీసు చేతికి వచ్చేంత వరకు తమ ఓటు భవితవ్యం ఏమిటో తెలియని  పరిస్థితి నెలకొన్నది. ఈ భారీ సంఖ్యలో ఉన్న నోటీసుల్లో ప్రధానంగా డేటా అనామలీస్‌‌తో పాటు ‘నో మ్యాపింగ్‌‌’ ఓటర్లు భారీగా ఉన్నారు. 2002లో నిర్వహించిన ‘సర్‌‌’ ఓటర్ల జాబితాతో పోల్చినప్పుడు తమ పేరు గానీ, తల్లిదండ్రులు, వారి పూర్వీకుల పేర్లుగానీ నమోదు చేయని వారు ఏకంగా 32,36,659 మంది ఉన్నట్టు గుర్తించారు. ఎన్యూమరేషన్‌‌ ఫారంలో సరైన ఆధారాలు ఇవ్వకపోవడంతో వీరిని  అన్‌‌మ్యాప్డ్‌‌ ఓటర్ల కేటగిరీలోకి చేర్చి, స్థానిక ఎలక్టోరల్‌‌ రిజిస్ట్రేషన్‌‌ అధికారులు (ఈఆర్‌‌వో) నోటీసులు జారీ చేయాల్సి వస్తోంది. వీరంతా తమ స్థానికతను నిరూపించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం  నిర్దేశించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.  

చిన్న తప్పులు వెంటనే అప్‌‌డేట్‌‌

నోటీసుల పర్వంలో సామాన్య ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. పేర్లలోని చిన్నపాటి అక్షర దోషాలు (స్పెల్లింగ్‌‌ మిస్టేక్స్‌‌), ఇంటిపేరులో తేడాలులాంటి స్వల్ప పొరపాట్లకు అనవసర అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తక్షణమే అప్‌‌డేట్‌‌ చేయాలని ఈఆర్‌‌వోలకు స్పష్టం చేసింది. అంతేకాకుండా, నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. నోటీసు అందిన వారం రోజుల్లోగా సరైన రాతపూర్వక వివరణ, అవసరమైన పత్రాలను సమర్పిస్తే సరిపోతుందని నోటీసుల్లోనే ముద్రిస్తున్నారు. కేవలం తీవ్రమైన వ్యత్యాసాలు, పౌరసత్వ అనుమానాలు, డూప్లికేట్‌‌ ఎంట్రీలు ఉన్న ఓటర్లను మాత్రమే ఈఆర్‌‌వోలు స్వయంగా విచారణకు పిలవనున్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా నిబంధనలు సరళీకరించినప్పటికీ, నోటీసులే సకాలంలో చేరకపోవడం పెద్ద అడ్డంకిగా మారింది.

అదనపు సిబ్బంది నియామకం..

అక్టోబర్‌‌ 15 నాటికి ప్రక్రియను ఎలాగైనా కొలిక్కి తీసుకురావాలన్న పట్టుదలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం క్షేత్రస్థాయి అధికారులను పరుగులు పెట్టిస్తోంది. విచారణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన సిబ్బందిని యుద్ధప్రాతిపదికన నియమించుకోవాలని ఈఆర్‌‌వోలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే అదనంగా 2 వేల మందిని నియమించారు.  ఒకవైపు ముసాయిదా జాబితాపై సాధారణ ప్రజల నుంచి వచ్చే మార్పులు, చేర్పులు,  అభ్యంతరాల దరఖాస్తులను పరిశీలిస్తూనే, మరోవైపు లక్షల ఓటర్లకు మందికి సంబంధించిన నోటీసుల సమస్యను పరిష్కరించడం సిబ్బందికి తలకుమించిన భారంగా మారింది. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి, మిగిలిన 80 శాతానికి పైగా ఉన్న నోటీసులను త్వరితగతిన  పంపిణీ చేయకపోతే గడువులోగా ప్రక్రియ పూర్తికావడం అసాధ్యంగా కనిపిస్తోంది.