మరికొన్ని గంటల్లో ఉబర్, ఓలా, ర్యాపిడో ఆటోలు, క్యాబ్లు బంద్

మరికొన్ని గంటల్లో ఉబర్, ఓలా, ర్యాపిడో ఆటోలు, క్యాబ్లు బంద్

హైదరాబాద్: ఉబర్, ఓలా, ర్యాపిడో.. ఇలా యాప్ ఆధారిత ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆగస్ట్ 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపడతామని ఆటో, క్యాబ్, యాప్ సంఘాల జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం, గౌరవ అధ్యక్షుడు గాజుల ముకేశ్ గౌడ్ హెచ్చరించారు.

ఈ కారణంగా ఆదివారం అంటే.. రేపటి నుంచి ఆటోలు బుక్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో సుమారు 7.5 లక్షల మంది, హైదరాబాద్లో 2.5 లక్షల మంది ఆటోలపై ఆధారపడి జీవిస్తున్నారు.

ఆర్టీసీ, కార్పొరేట్ సంస్థలకు ఈవీ ఆటోలను అందించే ప్రతిపాదనను నిలిపివేయాలని, డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని ఆటో, క్యాబ్, యాప్ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం థర్డ్ పార్టీ బీమా కల్పించాలని కోరింది. ప్రభుత్వం ప్రత్యేక ఆటో యాప్ను తీసుకురావాలని జేఏసీ ప్రతిపాదించింది.

డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్, రాస్తారోకోలు నిర్వహిస్తామని, సచివాలయం, ప్రజాభవన్, జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో ఉపాధి కోల్పోయి... ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల్ కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించాలన్నారు. తమ 14 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకు వెళడం ఖాయమని జేఏసీ స్పష్టం చేసింది.