బెంగళూరులో ఉద్యోగాలు.. భార్యాభర్తకు నెలకు రెండున్నర లక్షల శాలరీ.. అయినా అప్పుల ఊబిలో.. ఎందుకీ పరిస్థితి అంటే..

బెంగళూరులో ఉద్యోగాలు.. భార్యాభర్తకు నెలకు రెండున్నర లక్షల శాలరీ.. అయినా అప్పుల ఊబిలో.. ఎందుకీ పరిస్థితి అంటే..

బెంగళూరు: మహా నగరాల్లో ఒక కుటుంబం ప్రశాంతంగా జీవించాలంటే ఎంత సంపాదన ఉండాలనే ప్రశ్న ఈ మధ్య కాలంలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. పెరుగుతున్న ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసరాల ధరలు.. ఫోన్ల రీఛార్జ్ బిల్లులు.. ఇలా ఖర్చులు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతుండటంతో ఎంత సంపాదన ఉంటే ఒక కుటుంబం చీకూచింతా లేకుండా బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీల్లో బతుకుతుందనే చర్చ సోషల్ మీడియాలో ఇటీవల హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో.. బెంగళూరుకు చెందిన ఒక కుటుంబం రెడిట్ పోస్ట్ ఈ చర్చను మరింత ఆసక్తికరంగా మార్చింది.

బెంగళూరు దంపతులు నెలకు రూ. 2.5 లక్షలు సంపాదిస్తున్నా అప్పుల్లో కూరుకుపోయారు. ఎందుకిలా జరుగుతుందనే విషయంలో కారణాలను రెడిట్లో పోస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తన రెడ్డిట్ పోస్ట్‌లో, నెలకు రూ. 2.5 లక్షల కుటుంబ ఆదాయం ఉన్నా.. EMIలు, అద్దె, క్రెడిట్-కార్డ్ బిల్లుల వల్ల ఎలా సంపాదన ఆవిరైపోతుందో ఆవేదనతో వెలిబుచ్చాడు. ఎక్కువ జీతం ఉన్నప్పటికీ, బాధ్యతలు, ఇంటి రీనోవేషన్ వల్ల జీతాలు ఎలా కరిగిపోతాయో కళ్లకు కట్టిన పరిస్థితి ఈ కుటుంబానిది.

29 ఏళ్ల కుర్రాడు పెళ్లి చేసుకుని తన భార్యతో కలిసి ఉద్యోగం చేస్తూ బెంగళూరు సిటీలో ఉంటున్నాడు. అతను, అతని భార్య కలిసి ఉద్యోగాలు చేస్తూ ప్రతి నెలా రూ. 2.5 లక్షలు సంపాదిస్తున్నారు. సిటీల్లో ఉంటున్నామని పార్టీలకు, పబ్లకు వెళ్లే మనుషులు కూడా కాదు. బయట తినడం కూడా చాలా తక్కువ. హంగూఆర్భాటాలకు పోయే మనుషులు కూడా కాదు.

►ALSO READ | 6వ తరగతి జీకే బుక్ లో ఇటలీ ప్రధాని మెలోని చాప్టర్... సోషల్ మీడియాలో వీడియో వైరల్...

నిరాడంబరంగా జీవించడానికి ప్రయత్నిస్తామని ఆ వ్యక్తి రెడిట్లో రాసుకొచ్చాడు. అయినప్పటికీ కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు. మంచి సంపాదన ఉన్నట్లు కనిపించినప్పటికీ, పెళ్లి, ఇంటి పునరుద్ధరణ, లోన్లు, పెరిగిపోతున్న క్రెడిట్-కార్డ్ బిల్లులు వంటి వరుస పెద్ద ఖర్చుల కారణంగా తాను ఎలా ఇబ్బందుల్లో పడ్డాడో ఆ వ్యక్తి రెడ్డిట్‌లో చేసిన పోస్ట్ ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎక్కువ శాలరీ వస్తే ఆర్థిక భద్రత ఉన్నట్లు అర్థం కాదని ఈ పోస్ట్ గుర్తు చేసింది.

మరీ ఈ 2.5 లక్షల డబ్బు ఎక్కడికి పోతోంది:
* ఇంటి EMI: రూ. 35,000
* పర్సనల్ లోన్ EMI: రూ. 16,000
* కారు లోన్ EMI: రూ. 15,000
* బెంగళూరు ఇంటి అద్దె, ఖర్చులు: రూ. 37,000
* క్రెడిట్ కార్డ్ ఖర్చు: సుమారు రూ. 70,000
* కిరాణా సామాగ్రి: రూ. 15,000
* SIP పెట్టుబడులు: రూ. 15,000
* బయట భోజనం: రూ. 4,000
* సినిమాలు, వినోదం: రూ. 2,000

ఈ మొత్తం కలిపి నెలకు సుమారు రూ. 2.09 లక్షలు అవుతుంది. ఇక ఏ అనుకోని ఖర్చులూ వచ్చి మీద పడకపోతే ఈ భార్యాభర్తకు 2.5 లక్షల జీతంలో నెలకు మిగిలేది రూ. 41,000 మాత్రమే. ఈ మొత్తం ఎపిసోడ్ మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే.. పొదుపు కంటే అప్పు వేగంగా పెరుగుతుంటే, క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల ఎవరూ ఆర్థికంగా సురక్షితంగా మారరు.

నెలకు రెండున్నర లక్షల సంపాదన బయటి నుంచి చూస్తే సౌకర్యవంతంగా అనిపించవచ్చు. కానీ.. ఈఎంఐలు, అద్దె, కుటుంబ బాధ్యతలు, గత ఆర్థిక నిర్ణయాలు వంటివి కమిట్మెంట్స్ ఉంటే లక్షల్లో జీతం ఉన్నా కూడా ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు.