టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే ఆయన.. ఇప్పుడు యువ నటుడు అనీష్, మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ జంటగా నటించిన 'ఇట్లు అర్జున' సినిమాకు అండగా నిలిచారు. మహేశ్ ఉప్పాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల నిర్మించగా.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. అక్టోబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విభిన్నమైన కథతో..
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో నాగార్జున సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నెల రోజుల క్రితమే ఈ సినిమా చూశానని, తనకు బాగా నచ్చిందని తెలిపారు. ఇలాంటి విభిన్నమైన కథను ఎంచుకుని, దాన్ని యాక్షన్‌తో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్గా మలిచిన యువ బృందాన్ని అభినందించారు. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని, ఈ చిత్రంతో అనుబంధం కలిగి ఉండటం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
మూగవాడి పాత్రలో అనీష్..
ఈ సినిమాలో అనీష్ మాటలు రాని యువకుడి పాత్రలో కనిపించనున్నారు. తొలి సినిమాతోనే ఇలాంటి సవాలుతో కూడిన పాత్రను ఎంచుకోవడం రిస్క్‌తో కూడుకున్నదని గతంలోనే అనీష్‌ను హెచ్చరించినట్లు నాగార్జున వెల్లడించారు. అయితే కథ విన్న తర్వాత కొన్ని సూచనలు కూడా ఇచ్చానని చెప్పారు. సినిమా చూసినప్పుడు అనీష్ ఆ పాత్రను ఎంతో హుందాగా, సహజంగా పోషించడం చూసి ఆశ్చర్యపోయానని ప్రశంసించారు. ఇక కీర్తి పాత్రలో అనస్వర రాజన్ అద్భుతంగా నటించిందని, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని నాగ్ కితాబిచ్చారు. యూత్‌ఫుల్ ఎనర్జీతో 'ఇట్లు అర్జున' థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
►ALSO READ | Dasara OTT releases: దసరా స్పెషల్: ఒకే రోజు ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు, సిరీస్‌లు.. ఏది ఎక్కడ చూడొచ్చంటే?
చిరంజీవితో మల్టీస్టారర్ ఎప్పుడంటే
ఈ ప్రెస్మీట్లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చేసే అంశంపై నాగార్జునకు ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. తాను కూడా ఆ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. చిరంజీవి తనకు మంచి స్నేహితుడని, ఇద్దరూ కలిసినప్పుడల్లా కలిసి ఏదైనా సినిమా చేద్దామనే చర్చ వస్తుందని చెప్పారు. అయితే అలాంటి ప్రాజెక్టుకు సరైన సమయం రావాలని నాగ్ వ్యాఖ్యానించారు.
దీంతో నాగార్జున, చిరంజీవి అభిమానుల్లో మల్టీస్టారర్‌పై మరోసారి ఆసక్తి మొదలైంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి..
