దేశ ఆర్థిక రంగంలో తెలంగాణ రాష్ట్రం మరోసారి తన సత్తా చాటింది. దేశంలోని మొట్టమొదటి అత్యంత ధనిక జిల్లాగా తెలంగాణలోని రంగారెడ్డి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. జాతీయ స్థాయిలో వెలువడిన రిపోర్ట్స్ ప్రకారం రంగారెడ్డి జిల్లాలో ప్రజల వార్షిక సగటు ఆదాయం రూ.11లక్షల 46వేలుగా నమోదైంది. దేశ రాజధానికి ఆనుకుని ఉండే హర్యానాలోని గురుగ్రామ్ రెండవ స్థానంలో, కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ 3వ స్థానంలో నిలిచాయి.
రంగారెడ్డి జిల్లా ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడి వేగవంతమైన పట్టణీకరణ, మౌలిక వసతులు, ఐటీ రంగం ఆధిపత్యంగా వెల్లడైంది. హైదరాబాద్ నగర విస్తరణలో భాగంగా మారిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రపంచ స్థాయి ఐటీ కారిడార్లు ఈ జిల్లా పరిధిలోనే ఉండటం ఇక్కడి ఆర్థిక వ్యవస్థను పరుగుపెట్టిస్తోంది. కేవలం ఐటీ రంగమే కాకుండా ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, రియల్ ఎస్టేట్, భారీ పారిశ్రామిక రంగాలు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తూ స్థానికుల తలసరి ఆదాయాన్ని పెంచాయి.
అలాగే రంగారెడ్డి జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి అద్భుతమైన కనెక్టివిటీ ప్రాజెక్టులు అంతర్జాతీయ పెట్టుబడిదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ జిల్లా కూడా రూ.5లక్షల 39వేల తలసరి ఆదాయంతో టాప్-25 జాబితాలో 18వ స్థానంలో చోటు సంపాదించుకోవడం రాష్ట్ర ఆర్థిక బలానికి నిదర్శనం. దేశంలోని అత్యుత్తమ ఆర్థిక కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలవడానికి ఈ జిల్లాల ప్రగతే ప్రధాన కారణం.
తలసరి ఆదాయంలో దేశంలోని టాప్-25 జిల్లాలు:
1. రంగారెడ్డి, తెలంగాణ: రూ.11 లక్షల 46వేలు
2. గురుగ్రామ్, హర్యానా: రూ.9 లక్షల 5వేలు
3. బెంగళూరు అర్బన్, కర్ణాటక: రూ.8లక్షల 93వేలు
4. గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) ఉత్తరప్రదేశ్: రూ.8లక్షల 48వేలు
5. సోలన్, హిమాచల్ ప్రదేశ్: రూ.8లక్షల 10వేలు
6. ఉత్తర & దక్షిణ గోవా, గోవా: రూ.7లక్షల 64వేలు
7. గ్యాంగ్‌టక్, నామ్చి, మంగన్ & గ్యాల్‌షింగ్, సిక్కిం: రూ.7లక్షల 46వేలు
8. దక్షిణ కన్నడ, కర్ణాటక: రూ.6లక్షల 69వేలు
9. ముంబై, మహారాష్ట్ర: రూ.6లక్షల 57వేలు
10. అహ్మదాబాద్, గుజరాత్: రూ.6లక్షల 43వేలు
11. గాంధీనగర్, గుజరాత్: రూ.6లక్షల 3వేలు
12. ఉడిపి, కర్ణాటక: రూ.5లక్షల 84వేలు
13. కోయంబత్తూర్, తమిళనాడు: రూ.5లక్షల 82వేలు 14. ఫరీదాబాద్, హర్యానా: రూ.5 లక్షల 81వేలు
15. చిక్కమంగళూరు, కర్ణాటక: రూ.5లక్షల 69వేలు
16. తిరువళ్లూరు, తమిళనాడు: రూ.5లక్షల 69వేలు
17. ఈరోడ్, తమిళనాడు: రూ.5లక్షల 68వేలు
18. హైదరాబాద్, తెలంగాణ: రూ.5లక్షల 39వేలు
19. హరిద్వార్, ఉత్తరాఖండ్: రూ.5లక్షల 33వేలు
20. పానిపట్, హర్యానా: రూ.5లక్షల 30వేలు
21. నామక్కల్, తమిళనాడు: రూ.5లక్షల 22వేలు
22. చెన్నై, తమిళనాడు: రూ.5లక్షల 20వేలు
23. భరూచ్, గుజరాత్: రూ.5లక్షల 5వేలు
24. నర్మద, గుజరాత్: రూ.5లక్షల 5వేలు
25. ఢిల్లీ: రూ.5లక్షల 1000
