గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు అన్ని వేళల డిజిటల్ కంటెంట్... స్కూల్ ఎడ్యుకేషన్, టీ–సాట్ మధ్య కీలక ఒప్పందం..

గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు అన్ని వేళల డిజిటల్ కంటెంట్... స్కూల్ ఎడ్యుకేషన్, టీ–సాట్ మధ్య కీలక ఒప్పందం..

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ అన్ని వేళలా అన్ లైన ద్వార అందించాలనే లక్ష్యంతో స్కూల్ ఎడ్యుకేషన్, టి-సాట్ మధ్య ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదిరింది. శనివారం ( ఆగస్టు 22 ) స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఒప్పంద పత్రాలపై డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసులో సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చకున్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ లెర్నింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నవీన్ నికోలస్, వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. డిజిటల్ కంటెంట్ ప్రసారాల విషయంలో ఎంఓయూ ఫలితంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు టి-సాట్ మధ్య కార్యక్రమాల ప్రసారాల విషయంలో స్పష్టత వస్తుందని అన్నారు. 

తొమ్మిది, పదవ తరగతి పిల్లలకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28 వేల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో సీఎం రేవంత్ ‘ముఖాముఖి’, ‘ మా జిల్లా మా పాఠశాల’ పేరుతో డీఈవోలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం, ఉపాధ్యాయుల కోసం ‘టి.ఎల్.ఎమ్’ మేళా వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఇక నుండి టి-సాట్ వేదికగా ప్రసారం చేసుకునేందుకు ఎంఓయూ ఉపయోగపడుతుందని అన్నారు.

డిజిటల్ ప్రసారాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని టి-సాట్ ద్వారా నిర్వహించే విధంగా సమగ్ర శిక్ష, ఎస్.ఇ.ఆర్.టి తదితర విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.