హైదరాబాద్: నకిలీ డాక్యుమెంట్లతో భూ రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు, మార్టిగేజ్‌లో ఉన్న ఆస్తులను విడిపించడం వంటి మోసాలకు పాల్పడుతున్న ముఠాను మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో డబుల్ రిజిస్ట్రేషన్లపై ఎస్‌ఓటీ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేస్తున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్ల వ్యవహారంపై పోలీసులు దృష్టి పెట్టి మల్కాజ్‌గిరిలో ఇద్దరిని, ఎల్‌బీనగర్‌లో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
1982 నాటి పత్రాలూ ఫోర్జరీ
పోలీసుల దర్యాప్తులో నిందితులు ఏకంగా 1982 నాటి డాక్యుమెంట్లను సైతం నకిలీగా సృష్టించినట్లు గుర్తించారు. పాత పత్రాల తరహాలో డాక్యుమెంట్లు తయారు చేసి, వాటి ఆధారంగా జీపీఏలు, సేల్ డీడ్లు సృష్టించినట్లు పోలీసులు తెలిపారు.మార్టిగేజ్‌లో ఉన్న స్థలాలను నకిలీ పత్రాల సాయంతో విడిపించడంతో పాటు, విదేశాల్లో ఉన్న వ్యక్తుల ఆస్తులను కూడా టార్గెట్ చేసినట్లు వెల్లడైంది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న వారి పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు, జీపీఏలు, సేల్ డీడ్లు తయారు చేసి ఆస్తులను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులు నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించి 8 చోట్ల మార్టిగేజ్ ప్రాపర్టీలను విడుదల చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆయా ఆస్తులను విక్రయించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.ఈ ముఠా వద్ద నుంచి పెద్ద సంఖ్యలో నకిలీ డాక్యుమెంట్లు, స్టాంప్ పేపర్లు, రబ్బర్ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాల తయారీ, రిజిస్ట్రేషన్లలో వీరి పాత్రపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసు దర్యాప్తులో మరో రౌడీషీటర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద పోలీస్ ఐడీ కార్డుతో పాటు కత్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్ల దందాతో అతనికి ఉన్న సంబంధాలపై పోలీసులు విచారణ చేపట్టారు.ప్రాపర్టీలకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్ల దందాపై ఎస్‌ఓటీ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారని అధికారులు తెలిపారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్లు, ఇతర మధ్యవర్తుల పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది.
నకిలీ పత్రాలతో ఆస్తులను కాజేయడం, డబుల్ రిజిస్ట్రేషన్లు చేయడం, మార్టిగేజ్‌లో ఉన్న ఆస్తులను అక్రమంగా విడిపించడం వంటి వ్యవహారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజ్‌గిరి సీపీ సుమతి హెచ్చరించారు. అవసరమైతే నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్లు, భూ మోసాలకు పాల్పడుతున్న మరికొందరిపై కూడా నిఘా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
