మంచిర్యాల జిల్లా: భీమారం మండలం దాంపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. బాల వికాస నీటి శుద్ధీకరణ పథకం ద్వారా నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి.. గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అలాగే పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన దాంపూర్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. 1970లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని, అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.దాంపూర్ గ్రామానికి 72 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే దాదాపు 70 శాతం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. దీంతో తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రజలందరూ అవసరమైన మేరకే విద్యుత్‌ను వినియోగించాలని, నీటిని పొదుపుగా వాడాలని సూచించారు.ఎల్‌నినో ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని మంత్రి ఆరోపించారు. ఆ అప్పులకు ప్రతి నెలా కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని అన్నారు.దాంపూర్ గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామంలో ఒక బోర్ కూడా వేయిస్తామని తెలిపారు.22 ఎకరాలు ఉన్న కేసీఆర్‌కు 400 ఎకరాలు ఎలా వచ్చాయి?అని మంత్రి ప్రశ్నించారు.
