ఇంటిని కడిగేందుకు ఫైర్ ఇంజిన్ కావాల్సి వచ్చిందా..? ఎమ్మెల్యే తీరుపై తీవ్ర దుమారం

ఇంటిని కడిగేందుకు ఫైర్ ఇంజిన్ కావాల్సి వచ్చిందా..? ఎమ్మెల్యే తీరుపై తీవ్ర దుమారం

అగ్రి ప్రమాదాల సమయంలో,  ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఇంజిన్ ఇంటిని శుభ్రం చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఫైర్ ఇంజిన్ సేవలను ఓ ఎమ్మెల్యే వ్యక్తిగత పనులకు వాడుకోవడం గుజరాత్ లో తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.

గుజరాత్‌లోని దాహోడ్ జిల్లాలో ఎమ్మెల్యే బంగ్లాను కడగడానికి అత్యవసర ఫైర్ ఇంజిన్‌ను ఉపయోగించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. దేవగఢ్ బరియా మున్సిపాలిటీకి చెందిన ఫైర్ వెహికల్, దాన్‌పూర్ తాలూకాలోని ఎమ్మెల్యే బచ్చుభాయ్ ఖబాడ్ ఇంటిని శుభ్రం చేస్తూ కనిపించింది. హై ప్రెజర్ వాటర్ తో ఇంటి పైభాగాన్ని శుభ్రం చేశారు. 

ఈ వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఫైర్ ఇంజిన్ అంటే ఎమ్మెల్యే సొంత ఆస్తి అనుకున్నారా..? వ్యక్తిగత పనులకు ఎలా వాడుకుంటారు అంటూ దుమ్మెత్తి పోశారు. అటు సోషల్ మీడియాలోనూ ఎమ్మెల్యే తీరుపై ట్రోలింగ్ నడిచింది. దీంతో ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఖబాడ్ నుంచి రూ. 2,700 ఛార్జీలు వసూలు చేశారు. 

►ALSO READ | రాహుల్, ప్రియాంక అరెస్ట్.. బలవంతంగా వాహనం ఎక్కించిన పోలీసులు

ఈ ఘటనపై అధికారులు వివరణ ఇచ్చారు. దేవగఢ్ బరియా మున్సిపల్ చైర్‌పర్సన్ ఘమేష్ కలాల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నుంచి ఫైర్ ఇంజిన్ పంపమని కాల్ వచ్చింది. ఏదైనా తీవ్రమైన సమస్య ఉందని భావించి వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చి వాహనం పంపాను అని  అన్నారు.

ఫైర్ ఆఫీసర్ మయూర్ సింగ్ చౌహాన్ చెప్పిన ప్రకారం, వాహనం ఎమ్మెల్యే నివాసం దగ్గరకు చేరుకున్నప్పుడు ఆయన సహచరులు ఇంటిని కడగాలని, ముఖ్యంగా ముందు నుంచి ప్రారంభించాలని అడిగారు. సిబ్బంది దీన్ని హోక్స్ కాల్ అని తెలియజేయడంతో ఆపరేషన్‌ను ఆపేశారు. అనంతరం అవసరమైన ఛార్జీలు వసూలు చేశారు. ఈ హోక్స్ కాల్‌పై మరిన్ని విచారణలు జరుగుతాయని అధికారులు తెలిపారు.