పసిడి పరుగులు.. 3 నెలల గరిష్టానికి బంగారం.. హైదరాబాద్లో తులం ధర..

పసిడి పరుగులు..  3 నెలల గరిష్టానికి బంగారం.. హైదరాబాద్లో తులం ధర..
  • రూ.2.50 లక్షలకు చేరిన వెండి
  • రెండు రోజుల్లో రూ.15 వేలు జంప్​

న్యూఢిల్లీ: డాలర్​బలహీనత కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. ఢిల్లీలో వీటి ధరలు శుక్రవారం మూడు నెలల గరిష్ట స్థాయులను తాకాయి.  99.9 శాతం స్వచ్ఛత ఉండే పది గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,63,500కి చేరింది.  గురువారం ధర రూ.1,62,300 వద్ద ముగిసింది. చివరిసారిగా మే 19 తేదీన కూడా బంగారం ధర ఈస్థాయిలో నమోదైంది. 

కిలో వెండి ధర రూ.ఐదు వేలు ఎగబాకి రూ.2.50 లక్షలకు చేరింది. ఇది గత 15 వారాలలో అత్యధికం. గురువారం కిలో వెండి రూ.2.45 లక్షలు పలికింది. గత రెండు రోజులలో దీని రేటు రూ.15 వేలు ఎగబాకింది. లెమన్ మార్కెట్స్ డెస్క్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గర్గ్ మాట్లాడుతూ డాలర్ విలువతోపాటు లాంగ్ టర్మ్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ రాబడులూ తగ్గడంతో బంగారం వరుసగా మూడో వారంలోనూ పెరుగుతోందని వెల్లడించారు. 

అంతర్జాతీయ మార్కెట్లలో  స్పాట్ గోల్డ్ ఔన్సు (దాదాపు 28.3 గ్రాములు) ధర 81.58 డాలర్లు పెరిగి ధర 4,600.91 డాలర్లకు (దాదాపు రూ.4,40,240) చేరింది. ఔన్సు వెండి ధర దాదాపు 3 శాతం పెరిగి 69.87 డాలర్లకు ఎగబాకింది. హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ స్పాట్ గోల్డ్ ధర ఈ ఏడాది మే 18 తర్వాత అత్యధిక స్థాయికి చేరిందని తెలిపారు. కరెన్సీ, బాండ్ మార్కెట్లలో కనిపిస్తున్న హెచ్చుతగ్గులు డిమాండ్‌‌ను పెంచుతున్నాయని అభిప్రాయపడ్డారు.  

యూఎస్ బాండ్ల కొనుగోళ్లను రెట్టింపు చేయడంతో ఈ వారం బంగారం నాలుగు శాతానికి పైగా లాభపడిందని మిరే అసెట్ షేర్‌‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. విదేశీ మార్కెట్లలోనూ ధరలు పెరిగాయన్నారు.