- మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్ ద్వారా సాగునీటిని ఇవ్వకుంటే ఓట్లు అడగనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డతండా, మల్లారం, రసూల్‌పల్లి, చంటయ్యపల్లి, ఎరబెల్లి గ్రామాల్లో శుక్రవారం ‘పల్లెపల్లెకు పొన్నం అన్న, పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు సుప్రీంకోర్టు, ఎన్జీటీ క్లియరెన్స్ ఇచ్చిందని, త్వరలోనే ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. హనుమకొండ జిల్లాకు రూ.69 కోట్లు, కరీంనగర్ జిల్లాకు రూ.70 కోట్లు, సిద్దిపేట జిల్లాకు రూ.120 కోట్లతో కలిపి రూ.250 కోట్లు భూపరిహారం పంపిణీ కోసం కలెక్టర్ల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు.
త్వరలోనే టెండర్లు పిలిచి కాలువ నిర్మాణం పూర్తి చేస్తానన్నారు. ములుకనూర్ పీహెచ్సీ పరిధిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని పరీశీలించాలని ఆఫీసర్లకు సూచించారు. కొత్తకొండ మండలం ఏర్పాటు చేశాక సీఎంను తీసుకువచ్చి వీరభధ్రుడికి కట్టిన ముడుపు మొక్కులు తీర్చుకుంటామని తెలిపారు.
గ్రామస్తులు పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రసూల్‌పల్లి గ్రామానికి రూ.5 కోట్లతో లో లెవల్ బ్రిడ్జి, జీపి బిల్డింగ్, రోడ్ల అభివృద్ధి చేపట్టనున్నట్లు చెప్పారు. ఎర్రబెల్లిలో పల్లె దవాఖాన నిర్మాణానికి సర్పంచ్ శ్రావణ్ తన తండ్రి జ్ఞాపకార్థం మూడు గుంటల స్థలం, సంపు నిర్మాణానికి రూ.లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో అప్పయ్య, సర్పంచులు భూక్య పూర్ణిమ, గూడెల్లి కల్పన, బోయిని మహేశ్, భూక్య సునీత, కాలేరు శ్రావణ్ కుమార్, పోచంపెల్లి రాజిరెడ్డి పాల్గొన్నారు.
