కామారెడ్డి టీచర్ కు జాతీయ గౌరవం..నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికైన భవాని

కామారెడ్డి టీచర్ కు జాతీయ గౌరవం..నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికైన భవాని
  • రాష్ట్రం నుంచి ఒక్క ఉపాధ్యాయురాలే సెలెక్ట్

హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ఎంపీపీ గర్ల్స్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయురాలు భవానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసిన 48 మందిలో తెలంగాణ నుంచి ఆమె ఒక్కరే ఎంపికయ్యారు. గతేడాది కూడా ఈ అవార్డుకు ఆమె పేరు ప్రతిపాదించగా..ఈసారి ఇంటర్వ్యూల్లో తన ప్రతిభను చాటుకుని పురస్కారాన్ని దక్కించుకున్నారు.

వచ్చే నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా భవాని బెస్ట్ టీచర్ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు భవానికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అభినందనలు తెలిపారు. భవాని..పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం కాకుండా, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెద్దపీట వేస్తున్నారు.

పిల్లలకు సులభంగా అర్థం కావడానికి, నేర్చుకున్న అంశాలు ఎప్పటికీ గుర్తుండేలా నృత్య రూపకంలో పాఠాలు బోధిస్తున్నారు. అలాగే పాఠశాలలో విద్యార్థులు చేసే ప్రతి యాక్టివిటీని రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నారు. ఇటీవల విద్యాశాఖ తరఫున ఫిన్లాండ్ పర్యటనకు వెళ్లిన 40 మంది ఉపాధ్యాయుల బృందంలోనూ ఆమె ఉండటం విశేషం. అక్కడి అంతర్జాతీయ విద్యా విధానాలను పరిశీలించి వాటిని ఆమె తన క్లాసుల్లో అమలు చేస్తున్నారు.