హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఐసెట్-2026 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో 23,988 సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 414 కాలేజీల్లో అందుబాటులో ఉన్న 38,462 సీట్లకు ఈ కేటాయింపులు చేసినట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఏ. శ్రీదేవసేన శుక్రవారం తెలిపారు. ఎంబీఏలో 31,181 సీట్లకు గాను 20,889 (67 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి.
ఎంసీఏలో 7,281 సీట్లకు గాను 3,099 (43 శాతం) సీట్లు మాత్రమే నిండాయి. ఫైనల్ ఫేజ్ ముగిసినా మొత్తం 14,474 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఎంసీఏ కాలేజీల్లో 62 శాతం సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 24లోపు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఒరిజినల్ టీసీతో ఈనెల 25లోపు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలకు https://tgicet.nic.in చూడాలని తెలిపారు.
బీపీఈడీ సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు..
బీపీఈడీ, యూజీడీపీఈడీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీపీఈసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కన్వీనర్ కోటాలో 1,173 సీట్లు అందుబాటులో ఉండగా.. 891 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా 661 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన వారు ఈనెల 27లోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి జాయినింగ్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
