పబ్లిక్ సొమ్ముతో ప్రైవేట్ కార్యక్రమానికి సీఎం రేవంత్ : ఎంపీ అర్వింద్ 

పబ్లిక్ సొమ్ముతో ప్రైవేట్ కార్యక్రమానికి సీఎం రేవంత్ : ఎంపీ అర్వింద్ 
  • ​..లండన్ వెళ్లింది అక్బరుద్దీన్ కూతురు పెళ్లికే: ఎంపీ అర్వింద్ 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి పబ్లిక్​ సొమ్ముతో ప్రైవేట్​కార్యక్రమానికి వెళ్తున్నారని, ఆయన లండన్​వెళ్తున్నది అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లికి అనే సమాచారం ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం తన టూర్ ​షెడ్యూల్​లో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశాలకు వెళ్లేముందు నిబంధనల ప్రకారం క్లియరెన్స్ తీసుకోవాలన్న కనీస అవగాహన కూడా ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. కేవలం సాంకేతిక కారణాలతోనే యూఎస్​ పర్మిషన్ ఆగిందని, ఇందుకు  కేంద్రప్రభుత్వాన్ని బద్నాం చేయడం కరెక్ట్​ కాదన్నారు. ‘నన్ను గుండు గుండు అని తిట్టడం మానేసి, రైతులకు మేలు చేసే పనులు చేయండి. కేసీఆర్ ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారో, రేవంత్ రెడ్డి అదే బాటలో నడుస్తున్నారు’ అని విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీలో రేవంత్ రెడ్డి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని అరవింద్ పేర్కొన్నారు.