హైదరాబాద్‌లోని ఇనార్బిటీ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న యువతిని జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యువతి మృతి చెందడటంతో పంజాగుట్ట పోలీసులు సంజూష్‌పై కేసు నమోదు చేశారు. కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ శుక్రవారం (ఆగస్ట్ 21) ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన రోజే సంజూష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. నిందితుడికి బ్రీత్ అనలైజర్ టెస్ట్, యూరిన్, బ్లడ్ టెస్టులు చేశామని చెప్పారు. ఆల్కహాల్, డ్రగ్స్ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిందని తెలిపారు. బ్లడ్ శాంపిల్స్‌ను FSLకు పంపించామని చెప్పారు. ప్రమాదానికి కారణమైన ఆస్టన్ మార్టిన్ కారును సీజ్ చేశామన్నారు. BNS 106(1) కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.
ఆల్కహాల్ తీసుకున్నట్లు తేలితే సెక్షన్లు మారుస్తామని స్పష్టం చేశారు. కేసు బెయిలబుల్ కావడంతో నిందితుడిని అరెస్టు చేయకుండా స్టేయిన్ బెయిల్ ఇచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే భారతిని ఆస్పత్రికి తరలించామని.. కేసులో అన్ని ప్రామాణిక విధానాలు పాటించామని పేర్కొన్నారు. ఈ ఇష్యూలో ఎంపీ లింగమనేని రమేష్ ఎలాంటి ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేదని తెలిపారు.
