దక్షిణాది సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి (94) చెన్నైలో కన్నుమూశారు. ఆగస్టు 21న మధ్యాహ్నం 1.59 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ ధృవీకరించారు. కొంతకాలంగా వయోభారంతో పాటు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు.
1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి జానకి. చిన్న వయసులోనే రేడియో కళాకారిణిగా గుర్తింపు పొందిన ఆమె.. 1949లో రక్షరేఖ మూవీలో - తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 1950 ప్రాంతంలో ‘షావుకారు’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్ సరసన నటించిన ఈ తొలి చిత్రం విజయంతో ఆమె పేరులో ‘షావుకారు’ శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి ఏడు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు.
షావుకారు జానకి కెరీర్‌లో మరో అరుదైన విశేషం ఉంది. దివంగత ముఖ్యమంత్రులైన ఎన్టీ రామారావు, ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), ఎం. కరుణానిధి, జయలలితలతో కలిసి ఆమె సినిమాల్లో నటించారు. అందుకే నలుగురు ముఖ్యమంత్రులతో స్క్రీన్ షేర్ చేసిన అరుదైన నటిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు దక్కింది.
'రోజులు మారాయి', 'కన్యాశుల్కం', 'పాతాళ భైరవి' తరహా కాలం నాటి తెలుగు చిత్రాల్లో నటించారు. అటు పాలుం పళముం’, ‘పుతియా పరవై’, ‘ఇరు కోడుగల్’, ‘ఎదిర్ నీచల్’, ‘తిల్లుముల్లు’, ‘కాంచె’, ‘హే రామ్’ వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్‌గా రాణించిన తర్వాత అక్క, తల్లి, అమ్మమ్మ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు.
కుటుంబ విషయానికి వస్తే.. జానకి భర్త పేరు దివింగత శంకరమంచి శ్రీనివాస రావు, ఆమెకు ముగ్గురు పిల్లలు యజ్ఞ ప్రభ కోటి, వెంకటరమణ శంకరమంచి, సచి రావు. నలుగురు మనవరాళ్లు కాగా నలుగురు మునిమనవరాళ్లు ఉన్నారు. షావుకారు జానకి ప్రముఖ నటి కృష్ణకుమారికి అక్క. ఆమెకు ముగ్గురు సంతానం ఉన్నారు. మనవరాలు వైష్ణవి అరవింద్ కూడా నటిగా గుర్తింపు పొందారు.
ఆమె ప్రతిభకు ఎన్నో పురస్కారాలు దక్కాయి. తమిళనాడు ప్రభుత్వ కళైమామణి, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, రెండు నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, ఎంజీఆర్ అవార్డు, ఏఎన్నార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను సైతనం అందుకున్నారు., సివాజీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, SIIMA లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు, జయలలిత స్పెషల్ కళైమామణి వంటి గౌరవాలు అందుకున్నారు.
ALSO READ : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. సీనియర్ నటి 'షావుకారు' జానకి కన్నుమూత!
అయితే ఆమె సినీ జీవితానికి అత్యున్నత గుర్తింపుగా నిలిచింది 2022లో కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మశ్రీ. ఏడు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు ఈ గౌరవం లభించింది. తెరపై నాలుగు తరాల నటీనటులతో కలిసి నటించిన షావుకారు జానకి.. తన అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ, విభిన్న పాత్రలతో దక్షిణాది సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఆమె మరణంతో ఒక నటీమణి మాత్రమే కాదు.. ఓ సినీ యుగం ముగిసినట్లయిందని సినీ ప్రముఖులు త్రీవ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
