సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి (94) చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వయోభారంతో పాటు గత కొంతకాలంగా తీవ్ర శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. ఆమె మృతితో దక్షిణాది సినీ లోకం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. జానకి మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
1931 డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జానికి జన్మించారు. తొలుత ఆమె రేడియో ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1950లో దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ తెరకెక్కించిన క్లాసిక్ హిట్'షావుకారు' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనను కనబరిచి, ఇంటింటా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తన ఇంటి పేరుగా 'షావుకారు' జానకిగా స్థిరపడిపోయారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 450కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేషన్, ఎంజీఆర్, రాజ్ కుమార్ వంటి మహానటుల సరసన కథానాయకిగా అలరించారు. కేవలం కథానాయికగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్య నటిగా, విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు. దేవదాసు', 'కన్యాశుల్కం', 'మంచి మనసులు', 'సంసారం' వంటి అనేక చిరస్మరణీయ చిత్రాలు ఆమె నటనా విశ్వరూపానికి నిదర్శనాలు.
చిత్రసీమకు ఆమె చేసిన విశేష సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ఆమెను 2022లో 'పద్మశ్రీ' పురస్కారంతో సత్కరించగా, అనేక రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి. జానకి భర్త పేరు దివింగత శంకరమంచి శ్రీనివాస రావు, ఆమెకు ముగ్గురు పిల్లలు యజ్ఞ ప్రభ కోటి, వెంకటరమణ శంకరమంచి, సచి రావు. నలుగురు మనవరాళ్లు కాగా నలుగురు మునిమనవరాళ్లు ఉన్నారు.
ఆమె మృతిపట్ల సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. ఒక మాతృమూర్తిలా, ఒక దిగ్గజ నటిగా భారతీయ సినిమాపై ఆమె వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది.
