తిరుమల మెట్ల మార్గంలో హైటెక్ రోబో డాగ్

తిరుమల మెట్ల మార్గంలో హైటెక్ రోబో డాగ్
  • భక్తుల భద్రత కోసం టీటీడీ సరికొత్త ప్రయోగం

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓ సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. తిరుమలలో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు క్వాడ్రూప్డ్ రోబోట్‌‌(నాలుగు కాళ్ల రోబోట్ డాగ్)ను వినియోగించే దిశగా చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా గురువారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద రోబోట్ డాగ్ పనితీరును టీటీడీ అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు.

అటవీలో మనుషులు వెళ్లడానికి ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన ప్రాంతాల్లో చిరుతలు, ఇతర క్రూరమృగాల కదలికలను పర్యవేక్షించేందుకు రోబోట్‌‌  డాగ్ ను ఎలా వినియోగించాలనే వివరాలు తెలుసుకున్నారు. ఈ హైటెక్ రోబోట్ లో అత్యాధునిక ఆప్టికల్ కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, 360 డిగ్రీల లైడార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఫీచర్లు ఉన్నాయి.

దీనివల్ల దట్టమైన పొగమంచు, చిమ్మచీకటిలో కూడా జంతువుల కదలికలను ఇట్టే గుర్తించవచ్చు. అంతేకాకుండా, ఈ రోబోట్ జంతువులు లేదా మనుషులు కనిపించగానే వెంటనే కంట్రోల్ రూమ్‌‌కు లైవ్ వీడియో ఫీడ్, జియో-ట్యాగ్‌‌డ్ అలర్ట్‌‌లను పంపిస్తుంది. ఒకవేళ మనుషులు నడిచే కాలిబాటల వైపు వన్యప్రాణులు వస్తే.. వాటికి రోబోట్‌‌లోని సౌండ్, లైట్ యూనిట్ల ద్వారా సురక్షితంగా తిరిగి అడవిలోకి మళ్లించేలా దీన్ని డిజైన్ చేశారు. సాధారణ పెట్రోలింగ్ సిబ్బందికి ఇదొక శక్తివంతమైన మొబైల్ మానిటరింగ్ నేస్తంలా పనిచేస్తూ, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేయనుంది.