టీసీఎస్ ల్యాప్‌టాప్ ట్రాకింగ్ వివాదం: టెక్కీల్లో మెుదలైన ఆందోళన

టీసీఎస్ ల్యాప్‌టాప్ ట్రాకింగ్ వివాదం: టెక్కీల్లో మెుదలైన ఆందోళన

టాప్ ఐటీ కంపెనీ TCS ఉద్యోగుల పట్ల తీసుకుంటున్న తాజా నిర్ణయం టెక్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగులకు కేటాయించిన అధికారిక ల్యాప్‌టాప్‌లలో 'డిజిటల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మానిటరింగ్' టూల్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు ఏయే అప్లికేషన్లను వాడుతున్నారు? దానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు? అనే వివరాలను ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ట్రాక్ చేయెుచ్చు. అయితే ఇది కేవలం డేటా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసమేనా లేక ఉద్యోగుల ప్రతి కదలికపై నిఘా పెట్టడానికా అనే దానిపై ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది.

సాధారణంగా ఐటీ, బీపీఎం కంపెనీల్లో ఉద్యోగుల పనితీరును అంచనా వేయడానికి కొన్ని రకాల మానిటరింగ్ టూల్స్‌ను వాడటం సర్వసాధారణమే. అయితే టీసీఎస్ ఎలాంటి ముందస్తు అధికారిక సమాచారం ఇవ్వకుండానే ఈ టూల్‌ను ఏర్పాటు చేయటం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైంది. క్లయింట్ల సెన్సిటివ్ డేటాను రక్షించడానికి, డేటా లీకేజీలను అరికట్టడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఈ టూల్ సహాయంతో ఒక్కో ఉద్యోగి వర్కింగ్ సమయం, అప్లికేషన్ల వినియోగాన్ని క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కూడా ఉండటంతో గోప్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడమే లక్ష్యమా?
ఈ టూల్ ముఖ్య ఉద్దేశం ఉద్యోగుల పనితీరును గమనించడం కాదని.. సిస్టమ్‌లో అప్లికేషన్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికేనని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. అప్లికేషన్లు హ్యాంగ్ అవుతున్నాయా.. యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనే మెట్రిక్స్ సేకరించడం ద్వారా క్లయింట్ ప్రాజెక్ట్‌లను మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని EIIRTrend సీఈఓ పారీఖ్ జైన్ అన్నారు. టెక్నాలజీ పరంగా ఇది మంచిదే అయినప్పటికీ.. సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల దీన్ని సర్వైలెన్స్ టూల్‌గా చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జెడ్‌స్కీలర్ భాగస్వామ్యంతోనే టూలా?
కొన్ని నెలల క్రితం టీసీఎస్ సైబర్ సెక్యూరిటీ దిగ్గజం 'జెడ్‌స్కీలర్'తో తన జతకట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే టీసీఎస్ వర్క్‌స్పేస్ ఎక్స్‌పీరియన్స్ స్టూడియోను లాంచ్ చేసింది. జీరో-ట్రస్ట్ సెక్యూరిటీ, వర్క్‌ప్లేస్ అబ్జర్వబిలిటీ, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ మానిటరింగ్ వంటి ఫీచర్లతో దీనిని రూపొందించారు. అయితే ఇప్పుడు ఉద్యోగ ల్యాప్‌టాప్‌లలో అమర్చిన టూల్ ఇదేనా అనే దానిపై టీసీఎస్ నుంచి అధికారిక స్పష్టత రాలేదు. గతంలో కాగ్నిజెంట్ కూడా 'ప్రొహన్స్' వంటి టూల్స్‌ను వాడి వార్తల్లో నిలిచింది.

ALSO READ : ఆగస్టు 24 నుంచి కొత్త టెలికాం రూల్స్.. 

6 లక్షల మంది ఉద్యోగులతో సవాల్
దాదాపు 6 లక్షల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న టీసీఎస్ లాంటి భారీ సంస్థలో ఈ స్థాయి డేటాను సేకరించి విశ్లేషించడం ఒక పెద్ద ఆపరేషనల్ సవాల్‌గా మారనుంది. క్లయింట్ల వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై పనిచేసేటప్పుడు డేటా సేఫ్టీకి భంగం కలగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సాఫ్ట్‌వేర్ వెండర్ వివరాలు, ఏయే డేటాను సేకరిస్తున్నారు, కంపెనీలో ఎవరికి ఈ సమాచార యాక్సెస్ ఉంటుందనే అంశాలపై టీసీఎస్ ఇంకా స్పందించాల్సి ఉంది. మొత్తానికి టెక్నాలజీతో కూడిన ఈ సరికొత్త పర్యవేక్షణ విధానం టీసీఎస్ ఉద్యోగులను భయానికి గురిచేస్తోంది.