సాధారణంగా కార్పొరేట్ ప్రపంచంలో లేట్ నైట్స్, వీకెండ్ వర్క్ అనేవి కంపెనీలు పనిని పూర్తి చేయడానికి ఎంచుకునే మార్గాలు. కానీ ముంబైకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్, ఎస్సాజీస్ అటెలియర్ ప్రిన్సిపల్ డిజైనర్ సారా షామ్ ఆలోచన పూర్తిగా భిన్నం. తన ఉద్యోగుల నుంచి అద్భుతమైన అవుట్‌పుట్ రావాలంటే వారు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమని ఆమె నమ్ముతారు. అందుకే సారా షామ్ తన సంస్థలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పని వేళలను నిర్దేశించి.. ఒక 'సూపర్ బాస్'గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
సారా షామ్ తన ఆఫీసులో నో వీకెండ్ కాల్స్, నో సండే డెడ్‌లైన్స్ అనే నియమాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. పనులు ఆలస్యమైతే ఉద్యోగులపై ఒత్తిడి పెంచి వారితో పని చేయించడం కంటే.. అదనంగా కొత్త డిజైనర్లను నియమించుకోవడానికే ఆమె మొగ్గు చూపుతారు. అలసటతో చేసే పని కంటే.. విశ్రాంతితో చేసే పనిలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుందని ఆమె నమ్ముతారు. క్రియేటివిటీ అనేది ఒక నల్లా లాంటిది కాదని.. అది ఒక బావి వంటిదని, నిరంతర ఒత్తిడితో ఆ బావిలోని క్రియేటివిటీ త్వరగా అడుగంటిపోతుందని ఆమె అంటున్నారు.
ఈ రూల్స్ వల్ల సంస్థకు కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యాయి. సారా షామ్ నియమాలను అంగీకరించని కొందరు క్లయింట్లు కంపెనీని వదిలి వెళ్లిపోయారు. అయితే వ్యాపారం కంటే ఉద్యోగుల మెంటల్ హెల్త్, ప్రొడక్టివిటీ ముఖ్యమని భావించిన సారా.. ఆ క్లయింట్లను వదులుకున్నా సరే తన పాలసీని మార్చుకోలేదు. ఆమె తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
తన వాదనకు బలంగా ఆమె మైక్రోసాఫ్ట్ జపాన్ చేసిన ఒక ప్రయోగాన్ని ఉదాహరణగా చూపుతారు. 2019లో మైక్రోసాఫ్ట్ 4 రోజుల పని దినాల విధానాన్ని అమలు చేసినప్పుడు.. ఉద్యోగుల ప్రొడక్టివిటీ ఏకంగా 40 శాతం పెరిగిందట. ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్న సారా షామ్, తక్కువ పని గంటలు, సరైన విశ్రాంతి ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచుతాయని నిరూపిస్తున్నారు. ఒక అలసిపోయిన డిజైనర్ కంటే.. ఫ్రెష్ మైండ్ తో ఉండే డిజైనర్ ఇచ్చే ఐడియాలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయని చెప్పారు.
ఒక బాస్ అంటే కేవలం పని చేయించుకునే వ్యక్తి కాదు, తన టీమ్ ఆరోగ్యాన్ని, సంతోషాన్ని కాపాడే వ్యక్తి అని సారా షామ్ నిరూపిస్తున్నారు. ఆఫీసు సమయం ముగియగానే ఉద్యోగులను ఇంటికి పంపడం ద్వారా ఆమె వారి వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇస్తున్నారు. కార్పొరేట్ సంస్కృతిలో మార్పు రావాలని కోరుకునే ప్రతి యజమానికీ, సారా షామ్ అనుసరిస్తున్న ఈ వర్క్ కల్చర్ చాలా మందిని ఆలోచింపజేస్తోంది.
