దేశ రాజకీయాల్లో యువతే కొత్త శక్తిగా మారుతోందని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలోని త్రిస్సూర్ లో ఏర్పాటు చేసిన డీవైఎఫ్‌ఐ (DYFI) రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. NEET శ్నపత్రం లీకేజీపై యువత చేపట్టిన ఆందోళనలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
దేశంలో దశాబ్దకాలంగా సాగుతున్న ఫాసిస్టు పాలనకు అంతం దగ్గరపడుతోందంటూ ప్రకాశ్ రాజ్ అన్నారు. అడవిలో ఓ క్రూరమృగం సంచరిస్తున్నప్పుడు మిగతా జంతువులు ఎలా అప్రమత్తం అవుతాయో.. నేటి యువత కూడా దేశాన్ని పట్టిపీడిస్తున్న 'రాజకీయ మృగాన్ని' అలాగే పసిగట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడేం భయపడటం లేదు.. మీ రాజకీయాలు మాకు అర్థమయ్యాయి అని యువత ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పిందని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
NEET వివాదం కేవలం పరీక్షా వ్యవస్థలోని లోపాల సమస్య కాదని, ఇది దేశ యువత భవిష్యత్తు, వారి అవకాశాలు, న్యాయంపై నమ్మకానికి సంబంధించిన అంశంగా ప్రకాశ్ రాజ్ అభివర్ణించారు. గతంలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఉద్యమించినా.. ఉద్యోగాలు, భూములు, జీవనాధారం కోల్పోతామనే భయాలు వారిని వెనక్కి లాగాయని అన్నారు. కానీ యువతకు 'కోల్పోవడానికి ఏమీ లేదు' అంటూ వారి పోరాట స్ఫూర్తిని ప్రశంసించారు.
ALSO READ : కాక్రోచ్ల నెక్స్ట్ టార్గెట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్..
జంతర్‌మంతర్‌లో భారీగా జరిగిన నిరసనలను గుర్తుచేసిన ఆయన.. యువత పార్లమెంట్ వైపు కదలాలని ప్రయత్నించడం దేశ రాజకీయ వ్యవస్థనే కుదిపేసిందన్నారు. ముఖ్యంగా హింసకు దూరంగా ఉండి ప్రశ్నలు అడగడమే యువత బలం అని చెప్పారు. అయితే బీజేపీని ఓడించడం ఒక్కటే పరిష్కారం కాదని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు గెలవవు.. అధికార పక్షాలే ఓడిపోతాయి అంటూ సంచలన వ్యాఖ్య చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ఎంచుకునేంత రాజకీయ చైతన్యం యువతలో రావాలని పిలుపునిచ్చారు. ఇది ఒక ఎన్నిక కోసం చేసే పోరాటం కాదు.. న్యాయం, మెరుగైన సమాజం కోసం జీవితాంతం సాగించే ప్రయాణం అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
