AIపై కొత్తగా టోకెన్ టాక్స్.. లేఆఫ్స్ వేళ ఆర్థిక వేత్త రఘురామ్ రాజన్ సంచలన ప్రతిపాదన

AIపై కొత్తగా టోకెన్ టాక్స్.. లేఆఫ్స్ వేళ ఆర్థిక వేత్త రఘురామ్ రాజన్ సంచలన ప్రతిపాదన

RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ AI వాడకంపై ఒక ఆసక్తికరమైన కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కంపెనీలు వాడే ఏఐ టోకెన్లపై ప్రత్యేకంగా పన్ను విధించాలని, అదే సమయంలో ఉద్యోగులకు మళ్లీ రీ-ట్రైనింగ్ ఇచ్చే వ్యాపారాలకు ట్యాక్స్ క్రెడిట్స్ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత పన్ను విధానాల వల్ల కంపెనీలు మనుషుల కంటే యంత్రాల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు కోల్పోతున్న లక్షల మందికి కొత్త ఏఐ టాక్స్ ద్వారా ఊరట కల్పించాలని సూచిస్తున్నారు రాజన్. 

ప్రపంచవ్యాప్తంగా ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని, అయితే దాని వేగం.. ప్రభావం ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టంగా చెప్పలేమని రాజన్ పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలు మనుషులకు బదులుగా టెక్నాలజీని ఎంచుకోవడానికి ప్రస్తుత పన్ను విధానాలు ఎలా దారితీస్తున్నాయో ప్రభుత్వాలు పరిశీలించాలని కోరారు. ఉదాహరణకు అమెరికాలో కంపెనీలు తమ ఉద్యోగుల కోసం సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ చెల్లిస్తుంటాయి. కానీ ఏఐని వాడినప్పుడు మాత్రం ఎలాంటి అదనపు భారం ఉండట్లేదని చెప్పారు. అంటే లేబర్ చట్టాల ప్రకారం ఉద్యోగులకు కోసం చేసే ఖర్చు ఏఐ కారణంగా లేకుండా పోతోంది. ఇది కంపెనీలకు కలిసొచ్చే అంశమేనని రాజన్ వాదన. 

ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి కంపెనీలు వినియోగించే ఏఐ టోకెన్లపై పన్ను విధించడమే ఒక మార్గమని రాజన్ వెల్లడించారు. ఏఐ మోడల్స్ ప్రాసెస్ చేసే చిన్న డేటా యూనిట్లను టోకెన్లు అంటారు. ఈ టోకెన్ల ఆధారంగానే కంపెనీలకు బిల్లింగ్ జరుగుతుంది. ప్రారంభంలో ఈ పన్నును చాలా తక్కువ రేటుతో మొదలుపెట్టి.. ప్రభుత్వాల అనుభవాన్ని బట్టి క్రమంగా పెంచవచ్చని సూచించారు. అయితే ఏఐ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా పన్ను రేటును చాలా జాగ్రత్తగా మలచాలని చెప్పారు.

ALSO READ : టీసీఎస్ ల్యాప్‌టాప్ ట్రాకింగ్ వివాదం

ఉద్యోగులను తొలగించకుండా వారిని ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీపై రీ-ట్రైనింగ్ చేసే కంపెనీలకు పన్ను రాయితీలు ఇవ్వాలని రాజన్ ప్రతిపాదించారు. కంపెనీలు ఏఐ వైపు వేగంగా మళ్లడం వల్ల ఉద్యోగులపై ప్రభావం పడకుండా ఉండేందుకు యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే పోటీ ప్రపంచంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.