లక్షతో తీస్తే రూ. 20 కోట్లు వసూళ్లు: పొట్టు పొట్టున ట్రోల్ చేసి.. సినిమాను ఫేమస్ చేసిర్రు

లక్షతో తీస్తే రూ. 20 కోట్లు వసూళ్లు: పొట్టు పొట్టున ట్రోల్ చేసి.. సినిమాను ఫేమస్ చేసిర్రు

సాధారణంగా ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే దానికి హిట్ టాక్ రావాలి, అద్భుతమైన రివ్యూలు ఉండాలి. కానీ, ఇప్పుడు ఒక చిత్రం మాత్రం రివర్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. అసలు సినిమా అంటేనే కదా 'చెత్త' అని ప్రేక్షకులు పెదవి విరిచినా, అదే సినిమాను చూడటానికి ఇప్పుడు జనం ఎగబడుతున్నారు. ఆ వింత చిత్రమే చైనా యానిమేషన్ మూవీ ‘న్యూ లాయ్‌’ (Niu Lai 'ఆవు వస్తోంది').

చెత్త సినిమా అంటూ తిట్టారు.. 

ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఈ చిత్రం రిలీజైన 10 రోజుల వరకు ఊహించని టాక్ ఎదుర్కొంది. కనీస ప్రమోషన్లు లేకపోవడం, ట్రైలర్ కూడా విడుదల చేయకపోవడం వంటి కారణాలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరుగున పడిపోయింది. ముఖ్యంగా మొదటి 10 రోజుల్లో దేశవ్యాప్తంగా కేవలం 300 మంది మాత్రమే టికెట్లు కొనుగోలు చేశారు. ఫలితంగా ఈ చిత్రం కేవలం 7,700 యువాన్లు (సుమారు రూ.1.04 లక్షలు) మాత్రమే వసూలు చేసింది. ‘2026లో విడుదలైన అత్యంత చెత్త సినిమా ఇదే’ అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. 

తిట్టినోళ్లే టికెట్లు కొన్నారు..

ఈ సినిమాలోని నాసిరకం కంప్యూటర్ గ్రాఫిక్స్, అపసవ్యమైన వాయిస్ యాక్టింగ్, అర్థం పర్థం లేని కథాంశానికి సంబంధించిన చిన్న చిన్న క్లిప్స్ సోషల్ మీడియాలోకి రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘ఇది ఒక విద్యార్థి ప్రాజెక్ట్ కంటే అధ్వాన్నంగా ఉంది’, "AI సృష్టించే గ్రాఫిక్స్ కంటే ఇది వరస్ట్" అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఈ నెగటివ్ టాక్ ఆ సినిమాకు శాపంగా మారడానికి బదులు.. ఒక శక్తివంతమైన ప్రచార సాధనంగా మారింది. "నిజంగానే ఈ సినిమా అంత చెత్తగా ఉందా?" అని స్వయంగా తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ కుతూహలమే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిసేలా చేసింది.

ALSO READ : ‘టాక్సిక్’ ఇంగ్లీష్ ట్రైలర్‌కు పిచ్చ క్రేజ్..

రూ.20 కోట్లకు చేరిన వసూళ్లు..

ప్రస్తుతం ఈ చిత్రం చైనాలో ఏకంగా 14.9 మిలియన్ యువాన్లు (సుమారు రూ.20 కోట్లు) వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వసూళ్లతో 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే', 'ది ఒడిస్సీ' వంటి స్టార్ క్యాస్టింగ్, భారీ బడ్జెట్ సినిమాల పోటీలకు ధీటుగా నిలిచింది.

ఈ సినిమా వెనుక ఉన్న కథ ఏంటంటే..

తల్లి-కొడుకు కలిసి ఐదేళ్ల కష్టం: ఈ సినిమా వెనుక ఉన్న కథ కూడా ఆసక్తికరంగా ఉంది. కేవలం ఇద్దరు వ్యక్తులు ఐదేళ్ల పాటు కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం. సిన్ యుమెంగ్, సన్ లిఫాంగ్ అనే తల్లి-కొడుకుల బృందం సినిమాకు రచయితలు, దర్శకులు, నిర్మాతలు, వాయిస్ ఆర్టిస్టులుగా కూడా వ్యవహరించారు. ఈ యానిమేషన్ చిత్రంలో లేగదూడ, పిచ్చుక మధ్య జరిగే విచిత్రమైన కలల ప్రపంచాన్ని చూపించారు. ముఖ్యంగా సినిమా పోస్టర్ మాత్రం ఎంతో ఆకర్షణీయంగా, కళాత్మకంగా ఉండటంతో దాన్ని చూసి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు లోపల కనిపించిన విజువల్స్ పూర్తిగా భిన్నంగా అనిపించాయి. 

బాక్సాఫీస్‌లో ఇదో విచిత్ర రికార్డు

ప్రస్తుతం AI సాయంతో అద్భుతమైన విజువల్స్, యానిమేషన్ సులభంగా రూపొందుతున్న సమయంలో ‘న్యూ లాయ్’లో కనిపించే ముడి, హ్యాండ్‌క్రాఫ్టెడ్ విజువల్స్ కొందరు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం సినిమాలోని ప్రతి అంశాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఏదేమైనా.. సినిమా బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే సాంప్రదాయ భావనకు భిన్నంగా, “అసలు ఇంత చెత్తగా ఉందా?” అనే కుతూహలం కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదని ‘న్యూ లాయ్’ నిరూపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం చైనీస్ బాక్సాఫీస్ వద్ద అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రికార్డులు కొల్లగొడుతుంది.