ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరంతా తిరిగి రావాల్సిన రోజు జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం కొమరగిరిపట్నానికి చెందిన కోపనాటి రామకృష్ణ వర్మకు చెందిన చేపల పడవ ఆగస్టు 3న ఓడలారెవు జెట్టీ నుంచి బయలుదేరింది. వైనతేయ నదీ-సముద్ర సంగమం మీదుగా వీరు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు.
ఈ వేట కోసం వారు దాదాపు 15 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, డీజిల్‌ను తమతో పాటు తీసుకెళ్లారు. అన్ని అనుకూలిస్తే ఆగస్టు 13 నాటికి వీరంతా తిరిగి రావాల్సి ఉండగా.... కానీ, గడువు దాటినా పడవ తిరిగి రాకపోగా, మత్స్యకారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అంతకంటే ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. వారి మొబైల్ ఫోన్లు, పడవలో ఉన్న జీపీఎస్ పరికరం కూడా పనిచేయడం మానేశాయి.
తిరిగి రావాల్సిన తేదీ దాటి ఏకంగా నాలుగు రోజులు గడిచిపోవడంతో పడవ యజమాని కుటుంబసభ్యులు హడలిపోయారు. వెంటనే ఒడలారెవు తీరప్రాంత భద్రతా పోలీసులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన కోనసీమ కలెక్టర్.. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టి వారిని రక్షించేందుకు విశాఖపట్నంలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ (తీరరక్షక దళం) సహాయాన్ని కోరారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ పడవ విశాఖపట్నం - పారాదీప్ తీరప్రాంతం వైపు వెళ్లినట్లు తెలుస్తోంది.
పడవ యజమాని క్యులేటర్ కమ్ డ్రైవర్ కోపనాటి రామకృష్ణ వర్మతో సహా మొత్తం ఎనిమిది మంది ఈ పడవలో ఉన్నట్లు మత్స్యశాఖ స్పష్టం చేసింది. కోస్ట్ గార్డ్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల గురించి ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే యంత్రాంగానికి తెలపాలని కోరారు.
