బజాజ్ కంపెనీకి చెందిన పాపులర్ బైక్ పల్సర్ 125 త్వరలోనే లేటెస్ట్ హంగులతో మార్కెట్లోకి రాబోతోంది. తాజాగా ఈ బైక్ ఓ డీలర్‌షిప్ యార్డ్‌లో కెమెరాకు చిక్కింది. గతంలో కనిపించిన మోడల్‌లో సాధారణ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండగా, ఇప్పుడు మాత్రం సరికొత్త టీఎఫ్‌టీ (TFT) డిస్‌ప్లేతో దర్శనమిచ్చింది. దీన్ని బట్టి ఈ బైక్ పల్సర్ 125 లైనప్‌లోనే అత్యంత ప్రీమియం అయిన 'టాప్-స్పెక్' వేరియంట్ అని స్పష్టమవుతోంది.
ఈ బైక్‌లో ఇచ్చిన టీఎఫ్‌టీ డిస్‌ప్లే చాలా పెద్దదిగా, చూడటానికి ఎంతో ప్రకాశవంతంగా, స్పష్టమైన అక్షరాలతో ఉంది. ఇందులో డిజిటల్ రెవ్ బార్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఇందులో 'రోడ్ మోడ్' ఆప్షన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మోడ్రన్ రైడర్లకు అత్యంత ఇష్టమైన బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్లు కూడా ఈ డిస్‌ప్లేలో పక్కాగా ఉండనున్నాయి.
డిజైన్ & ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
కొత్త పల్సర్ 125 సరికొత్త బాడీ స్టైల్‌తో ఆకట్టుకుంటుంది. అదే సమయంలో పల్సర్ బైక్‌లకు ఉండే ప్రత్యేకమైన స్పోర్టి లుక్‌ను మాత్రం కంపెనీ మార్చలేదు. ఈ కొత్త డిజైన్ వెనుక సరికొత్త ఫ్రేమ్ ఉంది. ఇది ట్యూబులర్ స్టీల్ డిజైన్‌తో వచ్చింని, ఇందులో ఇంజన్ బైక్ బాడీకి బలమైన భాగంగా పనిచేస్తుంది. ఇక సస్పెన్షన్ విషయానికొస్తే.. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్‌ను అమర్చారు.
కొత్త ఇంజిన్.. అద్భుతమైన పెర్ఫార్మెన్స్!
లీకైన ఫోటోలను గమనిస్తే.. ఈ బైక్‌లో పూర్తిగా కొత్తగా అభివృద్ధి చేసిన ఇంజిన్‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇంజిన్ కేసింగ్స్ షేప్, సరికొత్త ఎగ్జాస్ట్ హెడర్ రూటింగ్, అలాగే మందపాటి ఎగ్జాస్ట్ పైపును చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. దీనికి సంబంధించిన అధికారిక స్పెసిఫికేషన్లు ఇంకా బయటకు రాలేదు. అయినప్పటికీ, సిటీలో రోజూ తిరగడానికి అత్యంత సులువుగా ఉండేలా, మంచి పవర్‌ను ఇచ్చేలా ఈ ఇంజిన్‌ను తీర్చిదిద్దినట్లు అంచనా వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ బైక్ అధికారికంగా మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది!
