ఆధ్యాత్మికం : ఎవరినైనా అవమానిస్తున్నారా.. కర్మఫలంతో వారి కాళ్ల దగ్గరికే వెళతారు..కురుక్షేత్రంలో కుంతీదేవి చేసింది ఇదే..!

ఆధ్యాత్మికం : ఎవరినైనా అవమానిస్తున్నారా.. కర్మఫలంతో వారి కాళ్ల దగ్గరికే వెళతారు..కురుక్షేత్రంలో  కుంతీదేవి చేసింది ఇదే..!

భూమిపై జీవించిన ప్రతి జీవి కర్మ ఫలాన్ని అనుభవించాలి.  కొన్ని కర్మలు మంచిగాను.. మరికొన్ని చాలా చెడ్డగాను ఉంటాయి.    కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది.  అహంకారాన్ని.. గర్వాన్ని వదిలి  కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులవుతారని పండితులు చెబుతున్నారు.

భగవంతుడే ప్రతి పనికి  కర్త అయినప్పటికీ.. ఆయన కర్మకు అతీతుడని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుడు సృష్టిని పోషిస్తాడు...  మార్గనిర్దేశం చేస్తాడు.  ఎల్లప్పుడూ స్వతంత్రుడిగానే ఉంటాడు.
కర్మ కార్యాన్ని  స్పృశిస్తుంది..  కార్యానికి అతీతుడైన పరమాత్మను ఎప్పటికీ స్పృశించదని పండితులు చెబుతున్నారు. 

ప్రతి మనిషి కూడా  నావల్లే ఇది జరిగింది.. అంతటి మంచి ఫలితం నావల్లే వచ్చింది.. ఇది కేవలం నా ఫలితమే అని భావించినప్పుడు  కర్మబంధంలో చిక్కుకుంటాడు.మనకు అప్పగించబడిన పనిని  శ్రద్ధతో, నిజాయితీతో, నిస్వార్థంగా చేసి ఫలితాన్ని భగవంతుని పాదాల దగ్గర సమర్పించాలి.అప్పుడే ప్రతి కార్యం కూడా కర్మయోగంగా మారుతుంది.

మనం పూజను ఎంత శ్రద్దగా.. భక్తితో  చేస్తామే.. మన పని కూడా అలానే చేయాలి.  అంటే మనకు అప్పగించిన పని శ్రద్దగా చేయడం పూజతో సమానమని పండితులు చెబుతున్నారు. మన సేవ సాధనగా మారుతుంది.మన హృదయం కర్మబంధం నుండి విముక్తమై ప్రశాంతంగా ఉంటుంది.

కర్తవ్యాన్ని మనం చేయాలి, కానీ ఫలితాన్ని భగవంతునికి సమర్పించాలి.మన చేతులు పని చేయాలి,
మన హృదయం సేవ చేయాలి.. మన మనస్సు సాక్షిగా ఉండాలి,“సర్వం భగవంతుని కార్యమే” అనే భావంతో జీవించాలి.జీవించినంత కాలం యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి.

కర్మల పట్ల  ఆసక్తి, వ్యామోహం పెంచుకోకూడదు.  అనుకున్న పని అయినా.. కాకపోయినా  సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే వాటిని కామ్యకర్మలు  అంటారు.  అవి చాలా నీచమైనవని కర్మ సిద్దాంతం ద్వారా తెలుస్తుంది.

లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము. కుంతీదేవి తనకున్న వరం వల్ల పుట్టిన కర్ణుడిని తన తండ్రికి మచ్చ రాకూడదనీ, ఆ బిడ్డ వల్ల తన వివాహం జరగదేమో అనీ అప్పుడే పుట్టిన కర్ణుడిని నీటిలో వదిలేసింది. కానీ ఆ వదిలేసిన కర్ణుడి దగ్గరికే వెళ్లి తన ఐదుగురు కొడుకులు అయిన పాండవులను కాపాడమని వేడుకొంది అదే కర్మఫలం... మనం ఎవరిని బాధ పెడతామో, ఎవరిని కాదనుకుంటామో వాళ్ళ కాళ్ళ దగ్గరికే వెళ్లే రోజు ఒకటి వస్తుంది.

ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రథము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం జ్ఞాన యోగము. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. 

కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు . ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృష్టించుకొంటుంటాను. 

మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. 

కర్మ చేయడం మన హక్కు, కానీ ఫలితంపై అధికారం ప్రకృతికి లోబడి ఉంటుంది. ఫలితాన్ని ఆశించి చేసే పని మనిషిని బానిసగా మారుస్తుంది; ఫలితాన్ని సమర్పణ భావంతో వదిలేసే వ్యక్తిని కర్మ యోగిగా తీర్చిదిద్దుతుంది. తన నీటిని తాను తాగని నదిలా, తన పండ్లను తాను ఆరగించని వృక్షంలా మన కర్మలు లోక హితం కోరాలి. ఆశలు సంకెళ్ళయితే, ఆశయం రెక్కల వంటిది. 

 పోటీ ప్రపంచంలో కేవలం స్వార్థ ప్రయోజనం కోసమే పరుగెత్తడం వల్లనే మానసిక అశాంతి పెరుగుతోంది. విల్లు నుంచి విడిచిన బాణం లక్ష్యం వైపే వెళ్ళాలి కానీ వెనక్కి చూడకూడదు. త్యాగంలో ఉన్న ఆనందం భోగంలో లభించదు. ప్రతిఫలం ఆశించని సేవ పరమాత్మకు చేరువయ్యే రాజమార్గం. ఫలితాపేక్ష లేని క్రియే మనిషిని బంధనాల నుండి విముక్తుడిని చేస్తుంది.

జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రి నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడని పురాణాలు చెబుతున్నాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.