డీఎస్సీపై చర్చకు సభలో రెడీగా ఉన్నా : వైసీపీకి మంత్రి లోకేష్ సవాల్

డీఎస్సీపై చర్చకు సభలో రెడీగా ఉన్నా : వైసీపీకి మంత్రి లోకేష్ సవాల్

డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ పార్టీ ఆరోపిస్తుందని.. ప్రెస్ మీట్లు పెట్టి చెబుతుంది.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. అసెంబ్లీలో చర్చకు రండి అంటే.. సభకు రాకుండా తప్పించుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. 

డీఎస్సీపై చర్చించేందుకు అసెంబ్లీలో సిద్ధంగా ఉన్నాను.. అయినా ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు మంత్రి లోకేష్. డీఎస్సీని ఎంతో పారదర్శంగా నిర్వహించామని.. 16 వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని.. వాళ్లందరూ మా వెంటే ఉన్నారని.. మొన్న కర్నూలులో.. నిన్న విజయవాడలో ఆత్మగౌరవం ర్యాలీ నిర్వహించారన్నారు. 

మరో నాలుగు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని.. ఎంత అడ్డుకున్నా ఆగేది లేదని స్పష్టం చేశారు మంత్రి. సభలోకి రాకుండా సోషల్ మీడియాలో కామెంట్లు చేయటం.. ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నించటం ఏంటని ఎద్దేవ చేశారు నారా లోకేష్. కుంభకోణాలు, అవినీతి అనేది జగన్ ఫ్యామిలీకి పేటెంట్ అని.. సీబీఐ విచారణలు, కేసులు ఎవరిపై ఉన్నాయో అందరికీ తెలుసన్నారు మంత్రి లోకేష్. 

ఈ ఏడాది విద్యా సంవత్సరంలోనే లక్షా 10 వేల మంది పిల్లలు.. ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకున్నారని.. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల దగ్గర అడ్మిషన్లు పూర్తయ్యాయి అనే బోర్డులు పెడతారని.. ఇది జరిగితీరుతుందన్నారు మంత్రి లోకేష్. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు స్కూల్ ను దత్తత తీసుకుని.. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దామని.. నిడమర్రు స్కూల్ లో అడ్మిషన్ కోసం విపరీతమైన డిమాండ్ వచ్చిందన్నారు.