అమ్మ నీవెక్కడా.. తల్లిని తల్చుకుని గుక్కపెట్టి ఏడ్చిన నితీష్ రాణా

అమ్మ నీవెక్కడా.. తల్లిని తల్చుకుని గుక్కపెట్టి ఏడ్చిన నితీష్ రాణా

Nitish Rana: ఢిల్లీ ప్రిమియర్ లీగ్ (DPL) లో గుండెలను పిండేసే అత్యంత భావోద్వేగ సంఘటన చోటు చేసుకుంది. వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడుతున్న భారత స్టార్ క్రికెటర్ నితీష్ రాణా, మైదానంలోనే గుక్కపెట్టి ఏడ్చేశాడు. ఇటీవల కన్నుమూసిన తన కన్నతల్లిని గుర్తు చేసుకుంటూ ఆకాశం వైపు చేతులెత్తి నితీష్ రాణా కన్నీటిపర్యంతమైన దృశ్యం క్రీడాభిమానులను తీవ్రంగా చలించిపోయేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. 

మైదానంలోనే మోకాళ్లపై కూర్చుని రోదన: 

సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే అద్భుతమైన అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న వెంటనే, రాణా తన ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి తల్లి లేకపోవడంతో భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తూ, తన ఫిఫ్టీని తల్లికి అంకితం ఇచ్చి, మోకాళ్లపై కింద కూర్చుని మైదానంలోనే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. 

నితీష్ రాణాను ఓదార్చిన ప్రత్యర్థి ప్లేయర్లు: 

ఆగస్టు 7వ తేదీన నితీష్ రాణా తల్లి సతీష్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ మ్యాచ్‌లో తన తల్లి జ్ఞాపకార్థం జెర్సీ వెనుక భాగంలో N Satish అని ముద్రించుకుని రాణా బరిలోకి దిగాడు. కన్నీళ్లు పెట్టుకుని విలపిస్తున్న రాణాను చూసి చలించిపోయిన ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు, మైదానంలోని అంపైర్ వెంటనే అతని దగ్గరకు వచ్చి ఓదార్చారు. మనసును నిబ్బరం చేసుకున్న రాణా మళ్లీ బ్యాట్ పట్టి, మొత్తంగా 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 60 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

60 రన్స్ చేసినా తప్పని ఓటమి: 

నితీష్ రాణా వీరోచితంగా పోరాడి 60 రన్స్ చేసినప్పటికీ, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు 169 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ జట్టులో సనాత్ సంగ్వాన్ కిరాక్ సెంచరీ సాధించడంతో, ఆ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. అమ్మ నీవెక్కడా అంటూ మైదానంలో నితీష్ రాణా కార్చిన కన్నీళ్లు, తల్లిపై చూపించిన ప్రేమ ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను పిండేస్తోంది.