ఇండియా స్పిన్ మరింత బలంగా.. సుతార్, జడేజా మాయాజాలంతో లంక ఆలౌట్

ఇండియా స్పిన్ మరింత బలంగా.. సుతార్, జడేజా మాయాజాలంతో లంక ఆలౌట్
  •  మానవ్‌‌ సుతార్‌‌కు 4,  జడేజాకు 3 వికెట్లు
  • సోనల్‌‌ దినుషా సెంచరీ
  • ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 462 ఆలౌట్‌‌

bశ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌‌లో  ఇండియా పట్టు బిగించింది. స్పిన్నర్లు మానవ్‌‌ సుతార్‌‌ (4/76), రవీంద్ర జడేజా (3/57) స్పిన్‌‌ మ్యాజిక్‌‌ చూపెట్టడంతో.. లంక టాప్‌‌ ఆర్డర్‌‌ కుదేలైంది. అయితే మిడిలార్డర్‌‌లో సోనల్‌‌ దినుషా (100), నిరోషన్‌‌ డిక్వెల్లా (80) బ్యాట్లు అడ్డేయడంతో.. సోమవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌‌లో లంక 79.4 ఓవర్లలో 284 రన్స్‌‌కు ఆలౌటైంది. 

అంతకుముందు 460/9 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 116.4 ఓవర్లలో 462 రన్స్‌‌కు ఆలౌటైంది. కుల్దీప్‌‌ యాదవ్‌‌ (13 నాటౌట్‌‌), ప్రసిధ్‌‌ కృష్ణ (2) నాలుగు బాల్స్‌‌ మాత్రమే ఆడారు. ప్రభాత్‌‌ జయసూర్య 4, కేశార నువాంత 3, అషితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం లంక ఇంకా 178 రన్స్‌‌ వెనకబడి ఉంది. 

 99/5తో లంచ్‌‌కు..


ఇన్నింగ్స్‌‌ రెండో బాల్‌‌కు సిరాజ్‌‌ (1/29).. నిషాన్‌‌ మధుశక (0)ను డకౌట్‌‌ చేసి శుభారంభాన్నిచ్చాడు. సిరాజ్‌‌ వేసిన ఔట్‌‌ స్వింగ్‌‌ను ఎదుర్కోలేక ఫస్ట్‌‌ స్లిప్‌‌లో పడిక్కల్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. 0/1 స్కోరుతో కష్టాల్లో పడిన లంక ఇన్నింగ్స్‌‌ను లాహిరు ఉడార (27), దినేశ్‌‌ చండిమల్‌‌ (4) ఆదుకునే ప్రయత్నం చేసినా సక్సెస్‌‌ కాలేదు. 

పిచ్‌‌కు స్పిన్‌‌కు అనుకూలించడంతో త్వరగా బౌలింగ్‌‌కు దిగిన లెఫ్టార్మ్‌‌ స్పిన్నర్‌‌ మానవ్‌‌ సుతార్‌‌ అద్భుతమైన ఫ్లైట్‌‌, డీప్‌‌ టర్న్‌‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఎనిమిదో ఓవర్‌‌లోనే చండిమల్‌‌ను వెనక్కి పంపడంతో స్కోరు 27/2గా మారింది. ఇక ప్రసిధ్‌‌ బౌలింగ్‌‌లో ఫుల్‌‌ షాట్‌‌తో సిక్స్‌‌ కొట్టిన కమింద్‌‌ మెండిస్‌‌ (14), ఉడార బౌండ్రీలతో కుదురుకున్నట్లు కనిపించారు. సుతార్‌‌ బౌలింగ్‌‌లోనూ ఫుల్‌‌, కట్‌‌ షాట్స్‌‌తో ఫోర్లు రాబట్టారు. 

అయితే 14వ ఓవర్‌‌లో సుతార్‌‌ వేసిన టర్నింగ్‌‌ బాల్‌‌ను బలంగా కొట్టిన ఉడార.. గల్లీలో జైస్వాల్‌‌ చేతికి చిక్కాడు. 16వ ఓవర్‌‌లో కుల్దీప్‌‌ యాదవ్‌‌ (1/65) వేసిన టర్నింగ్‌‌ బౌన్సర్‌‌ను మెండిస్‌‌ ముందుకు నెట్టే క్రమంలో గిల్‌‌ చేతుల్లోకి వెళ్లింది.  దాంతో స్కోరు 59/4గా మారింది. ఈ దశలో కెప్టెన్‌‌ ధనంజయ్‌‌ డిసిల్వా (21), సోనల్‌‌ దినుషా ఓపికగా ఆడారు. దాదాపు 10 ఓవర్లు పేస్‌‌, స్పిన్‌‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే 27వ ఓవర్‌‌లో జడేజా బాల్‌‌ను టచ్‌‌ చేసిన డిసిల్వా స్లిప్‌‌లో రాహుల్‌‌కు క్యాచ్‌‌  ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా లంక 90/5తో పీకల్లోతు కష్టాల్లో పడగా 99/5తో లంచ్‌‌కు వెళ్లింది. 

నో వికెట్‌‌.. 

తొలి సెషన్‌‌లో పట్టు బిగించిన ఇండియాకు రెండో సెషన్‌‌లో గట్టి పోటీ ఎదురైంది. సోనాల్‌‌తో కలిసి నిరోషన్‌‌ డిక్వెలా.. ఇండియా బౌలింగ్‌‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ఇతర సహచరుల మాదిరిగా కాకుండా షాట్ల ఎంపికలో చాలా జాగ్రత్త వహించారు. సుతార్‌‌, జడేజా బౌలింగ్‌‌లో ఎక్కువగా స్వీప్‌‌ షాట్స్‌‌ ఆడి వికెట్లను కాపాడుకున్నారు. 

అదే టైమ్‌‌లో స్టంప్‌‌ లైన్‌‌ నుంచి బాల్స్‌‌ను బలంగా బౌండ్రీ వైపు కొట్టడంతో ఫీల్డింగ్‌‌ను విస్తరించాల్సి వచ్చింది. ఈ క్రమంలో డిక్వెల్లా 67, సోనాల్‌‌ 92 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీలు పూర్తి చేశారు. 29 ఓవర్ల పాటు ఇండియా బౌలింగ్‌‌ను ఆచితూచి ఆడిన ఈ జోడీ 116 రన్స్‌‌ జత చేసింది. ఫలితంగా 215/5తో టీ బ్రేక్‌‌కు వెళ్లింది. 

మూడో సెషన్‌‌ స్టార్టింగ్‌‌లోనే ప్రసిధ్‌‌ కృష్ణ (1/47) తొలి బ్రేక్‌‌ ఇచ్చాడు. అద్భుతమైన పుల్లర్‌‌ బాల్‌‌తో డిక్వెల్లాను ఔట్‌‌ చేశాడు. దాంతో సెంచరీ చేయకుండానే ఔటయ్యాడు. ఫలితంగా ఆరో వికెట్‌‌కు 146 రన్స్‌‌ కీలక భాగస్వామ్యం ముగిసింది. ఇక్కడినుంచి సుతార్‌‌, జడేజా మరోసారి తమ స్పిన్‌‌ మ్యాజిక్‌‌ను చూపెట్టారు. 

ఓ ఎండ్‌‌లో సోనాల్‌‌ పాతుకుపోయినా.. రెండో ఎండ్‌‌లో కేశార నువాంత (2), ప్రభాత్‌‌ జయసూర్య (10)ను పెవిలియన్‌‌కు పంపారు. దాంతో స్కోరు 274/8గా మారింది. ఇక 167 బాల్స్‌‌లో సెంచరీ చేసిన సోనాల్‌‌ను జడేజా ఎల్బీ చేశారు. రివ్యూకు వెళ్లినా బాల్‌‌ ప్యాడ్‌‌కు తాకిందని తేలడంతో సోనాల్‌‌ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. చివర్లో లాహిరు కుమార (10)ను సుతార్‌‌ ఔట్‌‌ చేయడంతో లంక మోస్తరు స్కోరుకే
 పరిమితమైంది.

సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌: 116.4 ఓవర్లలో 462 ఆలౌట్‌‌ (దేవదత్‌‌ 167, రాహుల్‌‌ 82, ప్రభాత్‌‌ జయసూర్య 4/109, కేశార నువాంత 3/175). 

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌‌: 79.4 ఓవర్లలో 284 ఆలౌట్‌‌ (సోనాల్‌‌ 100, డిక్వెల్లా 80, సుతార్‌‌ 4/76, జడేజా 3/57). 
 
టెస్ట్‌‌ల్లో 4 వేల రన్స్‌‌, 350 వికెట్లు తీసిన నాలుగో ప్లేయర్‌‌గా జడేజా రికార్డులకెక్కాడు. కపిల్‌‌ దేవ్‌‌, డానియల్‌‌ వెటోరి, ఇయాన్‌‌ బోథమ్‌‌ ముందున్నారు. ఇండియా తరఫున 350 కంటే ఎక్కు వికెట్లు తీసిన ఐదో బౌలర్‌‌గా జడేజా నిలిచాడు. తన 90వ మ్యాచ్‌‌లో అతను ఈ ఫీట్‌‌ సాధించాడు. అనిల్‌‌ కుంబ్లే (619), అశ్విన్‌‌ (537), కపిల్‌‌ దేవ్‌‌ (434), హర్భజన్‌‌ సింగ్‌‌ (417) ఈ జాబితాలో ఉన్నారు.